
గుంటూరు మెడికల్: అయోధ్యలోని బాలరాముని ఆలయం దర్శనార్థం గుంటూరు నుంచి రామభక్తులతో బయల్దేరిన అయోధ్య ప్రత్యేక రైలును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, శివస్వామిజీ జెండా ఊపి ప్రారంభించారు. పురందేశ్వరి మాట్లాడుతూ ఏపీ నుంచి అయోధ్యకు వెళ్తున్న తొలి రైలు అని చెప్పారు. భక్తులు బాలరాముని దర్శనం కోసం వెళుతుంటే చూడాలని మాత్రమే వచ్చానన్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో ప్రతిష్ట జరగడం చూస్తే ఆనందంగా ఉందని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు పునర్వైభవం సంతరించుకోవడానికి ప్రధాని నరేంద్రమోదీ త్యాగ ఫలితమేనని వెల్లడించారు. శ్రీరాముని చల్లని చూపు ఏపీపై ఉండాలని ఆకాంక్షించారు. బీజే పీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్, రాష్ట్ర ఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, రామకృష్ణారెడ్డి, జూపూడి రంగరాజు, యడ్లపాటి స్వరూపరాణి, శనక్కాయల అరుణ పాల్గొన్నారు.
ఐఏఎస్‌ల కమిటీ నియామకంపై సీఎంకు కృతజ్ఞతలు
తాడేపల్లిరూరల్: ఎస్సీ అండ్ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల సమీక్ష కోసం ఐఏఎస్‌ల కమిటీని నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సునీల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో రోస్టర్, ప్రమోషన్లలో రిజర్వేషన్ల సమీక్ష కోసం గతంలో నియమించిన మిడిల్ లెవల్ ఆఫీసర్స్ కమిటీకి బదులు ఆ స్థానంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఐఏఎస్‌ల కమిటీని నియమించడం ఎంతో హర్షణీయమని, ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లకు తమ సమస్యలను విన్నవించామని, వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి వారు కృషి చేశారని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆ ప్రకటనలో తెలిపారు.
వైకుంఠపురం హుండీ ఆదాయం రూ.40.54 లక్షలు
తెనాలి: పట్టణంలోని వైకుంఠపురంలో వేంచేసియున్న లక్ష్మీపద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీల లెక్కింపును బుధవారం నిర్వహించారు. స్థానిక సీతారామస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి.అమరనాథ్ సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో 51.600 గ్రాముల బంగారం, 321 గ్రాముల వెండి, రూ.40,54,922 నగదు వచ్చిందని అధికారులు తెలియజేశారు. వైకుంఠపురం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కుంభం సాయిబాబు, సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుడు అళహరి రవికుమార్, యూనియన్ బ్యాంక్, తెనాలి సిబ్బంది, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారని ఆలయ ఈఓ ఎం.తిమ్మానాయుడు వివరించారు.
యార్డుకు 1,30,662 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,30,662 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,26,797 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ. 21,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి 21,800 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.12,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 87,688 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్‌చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు.

