
మంగళగిరి: నగరంలోని శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీశైలం మల్లేశ్వరస్వామి వారి తలపాగా ఊరేగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామానికి చెందిన దేవాంగ సోదరులు భక్తిశ్రద్ధలతో శ్రీశైలంలోని మల్లేశ్వరస్వామి వారికి చేనేత తలపాగా నేయడం ద్వారా స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారన్నారు. 365 రోజులకు ఒక మూర చొప్పున భక్తిశ్రద్ధలతో, ఉపవాస దీక్షలతో స్వామివారికి తలపాగా నేస్తున్నారని పేర్కొన్నారు. ఆ తలపాగా నేయడం పూర్తయిన తరువాత దానిని శ్రీశైలంలోని స్వామివారి వద్దకు తీసుకువెళుతూ మార్గమధ్యలో మంగళగిరి నగరంలోని శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నగర పురవీధుల్లో ఊరేగించడం మంగళగిరి ప్రజల అదృష్టంగా భావించాలన్నారు. దేవస్థాన అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు, దేవాంగ ప్రముఖులు పాల్గొన్నారు.
జిల్లాలోకి
కేంద్ర బలగాలు రాక
నగరంపాలెం: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర బలగాలు జిల్లాకు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు సబ్ డివిజన్లలోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆదివారం కవాతు నిర్వహించారు. సీఐఎస్‌ఎఫ్, డీఎస్పీలు, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పట్టణాలు, గ్రామ, మండలాల్లో కలియ తిరిగారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ కవాతును నిర్వహించారు. దక్షిణ, ఉత్తర, తూళ్లూరు సబ్ డివిజన్ల పరిధిలో కొనసాగింది.
కార్తికేయుని
ఆలయంలో భక్తుల రద్దీ
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ ఏసీ ఎన్‌ఎస్ చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నేడు టెన్త్ హాల్
టికెట్లు విడుదల
గుంటూరు ఎడ్యుకేషన్: ఈనెల 18 నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల హాల్ టికెట్లు సోమవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ,ఇన్ వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖాధికారులు ప్రకటించారు. పాఠశాలల వారీగా హెచ్‌ఎం లాగిన్‌తో పాటు విద్యార్థులు ఇదే వెబ్‌సైట్ నుంచి నేరుగా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. టెన్త్ పరీక్షలకు జిల్లాలో 31,291 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఇన్విజిలేషన్ విధుల్లో ఉన్న ఉపాధ్యాయులను సోమవారం రిలీవ్ చేసి, పాఠశాలలకు పంపాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేసినట్లు డీఈవో పి.శైలజ ఆదివారం తెలిపారు. కాగా ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలతో ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని ఇంటర్మీడియెట్ విద్య ఉన్నతాధికారులు చీఫ్ సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు ఇచ్చారు.

