
మంగళగిరి: నగరంలోని పానకాల లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఆవరణలో శ్రీలక్ష్మీ నృసింహస్వామి మాలధారులకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళవారం వస్త్రాలను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా శ్రీలక్ష్మీ నృసింహస్వామి మాలధారులకు వస్త్రదానం, అన్నదానం చేస్తున్న తోట శ్రీనివాస్ యాదవ్ మిత్ర బృందం అభినందనీయులన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 150 మంది మాలధారులకు వస్త్రదానం చేయడం విశేషమన్నారు. దేవస్థాన ఏసీ ఎ.రామకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా మల్లన్న
తలపాగా ఉరేగింపు
వేటపాలెం: పందిళ్లపల్లిలో మహాశిరాత్రి పండుగ సందర్భంగా తయారు చేసిన శ్రీశైల మల్లన్న తలపాగాకు మంగళవారం వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. శ్రీగంగా పార్వతీ సమేత పునుగు రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో దేవాంగ శివస్వాములు నియమనిష్టలతో ఆచార సంప్రదాయాలతో శ్రీశైల మల్లన్న తలపాగాను 40 రోజులు శివమాల దీక్షలో ఉంచి చేతి మగ్గం మీద తయారు చేశారు. దేవాంగపురి పంచాయతీ హస్తినాపురం గ్రామస్తులు పృథ్వీ వెంకటేశ్వర్లు కుమారులు వెంకట సుబ్బారావు ఆశీస్సులతో తలపాగా తయారు చేశారని శివమాల దీక్ష స్వాములు తెలిపారు. ఈగ్రామోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కోలాట ప్రదర్శనలు, బాణాసంచాలతో గ్రామ వీధుల్లో తలపాగా ఉరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ గావించారు. దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు బండ్ల తిరుమలాదేవి, గుత్తి విశ్వేశ్వరరావు, సత్రం మల్లేశ్వరావు, బీరక సురేంద్ర పాల్గొన్నారు.
భరతనాట్యం చేస్తూ
గిరి ప్రదక్షిణ
నరసరావుపేట రూరల్: భరతనాట్యం చేస్తూ కళాకారుడు కోటప్పకొండ గిరిప్రదక్షిణను పూర్తిచేశాడు. లోక కల్యాణార్ధం, త్రికోటేశ్వరుడు కటాక్షించాలని, సంస్కృత భాషను అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ కోటప్పకొండ శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం అధ్యాపకుడు పి.కృష్ణవాసు శ్రీకాంత్ గిరి ప్రదక్షిణను నిర్వహించాడు. అన్నమాచార్య కీర్తనలకు భరతనాట్యంతో 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణను గంటన్నరలో పూర్తిచేశాడు. త్రికోటేశ్వరుని శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి నృత్యనీరాజనం సమర్పించినట్టు కృష్ణవాసు శ్రీకాంత్ తెలిపారు.
యార్డుకు 1,28,440 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,28,440 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,20,429 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ. 20,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి 21,500 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.12,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 1,03,461 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్‌చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు.
