‘అధికారిక’ వత్తాసు
● వార్డెన్లు సహకరించకుంటే బిల్లులు ప్రాసెస్ నిలుపుదల ● రెండు రోజుల క్రితం సమావేశంలో ఏఎస్‌డబ్ల్యూఓ హుకుం ● కొంత మంది వార్డెన్లు మామూళ్లు ఇవ్వబోమని అడ్డుతిరిగిన వైనం
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఉన్నతాధికారులు చెబితేనే డబ్బులు (ప్రోటోకాల్ ఖర్చులు) వసూలు చేస్తున్నామని.. ఎవరైనా సహకరించకపోతే బిల్లులు ప్రాసెస్ చేసేది లేదని గుంటూరు అర్బన్ ఏఎస్‌డబ్ల్యూఓ చెంచులక్ష్మి రెండు రోజుల కిత్రం జరిగిన హాస్టల్ వార్డెన్ల సమావేశంలో తెగేసి చెప్పారు. దీంతో కొంత మంది వార్డెన్లు ఇప్పటికే నెలవారీ మామూలు ఇస్తున్నామని.. మళ్లీ ప్రోటోకాల్ ఖర్చులు భరించలేమని తేల్చిచెప్పారు. దీంతో ఏఎస్‌డబ్ల్యూఓకి, వార్డెన్లకి మధ్య కొంత వాగ్వివాదం జరిగింది. ప్రోటోకాల్ ఖర్చులు అందరూ ఇవ్వాల్సిందేనని.. లేకపోతే హాస్టల్‌ను తనిఖీ చేసేటప్పుడు ఏదైనా వ్యతిరేక రిపోర్టు రాస్తే అదే ఫైనల్ అవుతుందని.. అప్పుడు చిక్కుల్లో పడాల్సి వస్తుందని వార్డెన్లను ఏఎస్‌డబ్ల్యూఓలు బహిరంగంగానే బెదిరించారు.
మీరు కూడా రాసివ్వండి
ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయంలో బిల్లులు ప్రాసెస్ చేయాలన్నా... ఏ పని చేయాలన్నా ముడుపులు ఇచ్చుకోవాల్సిందేనని ఈ నెల 7వ తేదీన ‘సాక్షి’ పత్రికలో కథనం వచ్చింది. ‘మామూలిస్తే ఎస్..సీ..’ అనే ఈ కథనంపై ఎస్సీ వెల్ఫేర్ అధికారులు స్పందించారు. దీనిపై ఎటువంటి మామూళ్లు వసూలు చేయడం లేదని తెనాలి డివిజన్ హాస్టల్ వార్డెన్లు రాసిచ్చారని.. మీరు కూడా రాసివ్వాలని గుంటూరు అర్బన్ ఏఎస్‌డబ్ల్యూఓలను రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఆదేశించారని సమాచారం. దీనిపై కొంత మంది వార్డెన్లు తాము ఎందుకు రాసిస్తామని వాదించినట్లు తెలిసింది.
స్టేట్ డైరెక్టర్‌కు ముడుపులు?
ఇటీవల గుంటూరు నగరంలోని ఎస్సీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌లో ఓ విద్యార్థినికి ప్రసవం అయిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఎలాంటి చర్యలు లేకుండా ఏఎస్‌డబ్ల్యూఓ రంగంలోకి దిగారు. సస్పెండ్ అయిన వార్డెన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను సుమారు రూ.40 లక్షల వరకు ప్రాసెస్ చేసి, అందులోని రూ.7 లక్షలు స్టేట్ ఎస్సీ వెల్ఫేర్ డైరెక్టర్‌కు ఇచ్చినట్లు కార్యాలయంలో బహిరంగంగానే సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఆ మొత్తం కూడా వార్డెన్ల నుంచి లాగేందుకు ఏఎస్‌డబ్ల్యూఓ బెదిరింపులకు దిగారు. ప్రోటోకాల్ ఖర్చుల పేరుతో తీసుకుంటున్నట్లు వార్డెన్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సస్పెండ్ అయిన వార్డెన్ స్థానంలో ఇన్‌చార్జి వార్డెన్‌ను నియమించి.. గర్భవతి అయిన విద్యార్థినికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చూశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై గుంటూరు జిల్లా ఏఓ(ప్రస్తుతం సెలవులో ఉన్న ఆ శాఖ డీడీ మధుసూదన్‌రావు)ని ఎస్సీ వెల్ఫేర్ డైరెక్టర్ వివరణ అడిగారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీడీల జూమ్ మీటింగ్‌లో అడిగినట్లు తెలిసింది.
నా దృష్టికి రాలేదు
ఎస్సీ వెల్ఫేర్ డీడీ మధుసూదన్‌రావు సెలవులో ఉన్నారు. నేను సిబ్బంది జీతాల వ్యవహారాలు చూస్తుంటాను. మామూళ్లు వసూలు చేస్తున్నట్లు వచ్చిన కథనంపై వార్డెన్లను అడిగితే కొంత మంది అదేమి లేదని చెప్పారు. కింది స్థాయిలో జరిగే విషయాలు నాకు తెలియడం లేదు.
– బి.మాణిక్యరావు,
అకౌంట్స్ ఆఫీసర్ (ఇన్‌చార్జి డీడీ)
Comments
Please login to add a commentAdd a comment