మూడు రోజులుగా కాల్వలో వృద్ధుడు
తెనాలి రూరల్: మూత్ర విసర్జనకు వెళ్లిన వృద్ధుడు ప్రమాదవశాత్తు కాల్వలో పడ్డాడు. మూడు రోజులుగా చెత్త కుప్పపై ఉంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. చివరకు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో బయటకు తీసి ఇంటికి పంపారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణ మారిస్‌పేటకు చెందిన సుభాని మార్కెట్‌లో తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. మూడు రోజుల కిందట తెల్లవారుజామున మూత్ర విసర్జనకు వెళ్లి ప్రమాదవశాత్తు మార్కెట్ వంతెన వద్ద తూర్పు కాల్వలో పడ్డాడు. స్పృహ తప్పిన అతను కొద్ది గంటల అనంతరం తేరుకుని వంతెన కింద ఉన్న చెత్తకుప్ప మీదకు చేరుకున్నాడు. సాయం కోసం కేకలు వేసినా ఎవరికీ వినిపించకపోవడంతో మూడు రోజుల పాటు అక్కడే ఉండి పోయాడు. సోమవారం సాయంత్రం స్థానికులు అతన్ని గుర్తించి మార్కెట్ వంతెన కూడలిలోట్రాఫిక్ విధుల్లో ఉన్న హోంగార్డులకు సమాచారం తెలిపారు. హోంగార్డులు చెన్నబోయిన నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, పేరయ్యలు తాడు సాయంతో కాల్వలోకి దిగి కాల్వ నుంచి బయటకు తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment