తెనాలిరూరల్: తెనాలి చెంచుపేటలో ఈనెల 16 సాయంత్రం తీవ్ర సంచలనం రేకెత్తించిన పండ్ల వ్యాపారి షేక్ రబ్బాని హత్య కేసు నిందితుడిని త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ ఎస్ రమేష్‌బాబు కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చినరావూరుకు చెందిన షేక్ రబ్బాని చెంచుపేటలోని భాను టీ స్టాల్ సమీపంలో పండ్ల బండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. రబ్బాని మేనకోడలును పినపాడుకు చెందిన గౌస్‌బాషాకు ఇచ్చి గతంలో పెళ్లి చేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్ల ఆమె పుట్టింట్లో ఉంటోంది. గౌస్‌బాషా ఆదివారం భార్య ఇంటికి వెళ్లి ఆమెను కాపురానికి పంపించాలని కోరాడు. ఈ సమయంలో రబ్బానికి, గౌస్‌బాషాకి మధ్య వాగ్వాదం జరిగింది. తన భార్యను కాపురానికి పంపించే విషయంలో రబ్బాని అడ్డుపడుతున్నాడన్న కోపంతో ఆదివారం సాయంత్రం చెంచుపేటలో ఉన్న రబ్బానిపై గౌస్‌బాషా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రబ్బానీని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ఎస్‌ఐ ప్రకాశరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment