ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
కలెక్టర్ నాగలక్ష్మి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఉమ్మడి కృష్ణ–గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనున్న దృష్ట్యా స్థానిక ఏసీ కళాశాలలో బ్యాలెట్ బాక్సులు భద్రపర్చే గదులు, రిసెప్షన్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్‌తోపాటు జేసీ భార్గవతేజ పరిశీలించారు. అధికారులకు సూచనలు సలహాలు అందించారు. ఫిబ్రవరి 26న పోలింగ్ మెటీరియల్ పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎన్నికల సిబ్బంది కోసం అన్ని వసతులూ కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ల్యాండ్ అండ్ సర్వే శాఖ ఏడీ పవన్ కుమార్, గుంటూరు తూర్పు, పశ్చిమ మండల తహసీల్దార్లు నగేష్, వెంకటేశ్వర్లు, రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు.
గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీ భార్గవ తేజతో కలిసి ఆమె పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. పలు సూచనలు చేశారు. జిల్లాలోని 11 కేంద్రాల్లో 9,277 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని వివరించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వెంకటలక్ష్మి, లైజన్ అధికారులుగా నియమించిన జిల్లా అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలను అరికట్టాలి
జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్పీ సతీష్ కుమార్‌తో కలసి ఆమె నార్కోటిక్ కో–ఆర్డినేషన్ కమిటీ (ఎన్‌సీఓఆర్‌డీ) జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి, ఎండీఎం, కోకైన్ వంటి మాదక ద్రవ్యాల కేసులు జిల్లాలో నమోదవుతున్నందున తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అంతర్గతంగా ప్రత్యేకంగా కమిటీలను పదిహేను రోజుల్లో ఏర్పాటు చేసేలా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మత్తు పదార్థాల రవాణా సమాచారం చేరవేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14405 టోల్ ఫ్రీ నంబరును విద్యా సంస్థల్లోనూ, జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లోనూ ప్రదర్శించాలని చెప్పారు. నిరంతరం తనిఖీలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలపై గట్టి నిఘా పెట్టామని వివరించారు. విద్యార్థులూ మత్తుపదార్థాలు తీసుకుంటున్నారని, వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు వివరించారు. నేరస్తులపై కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఖాజా వలి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కన్జర్వేషన్ రిజర్వ్‌గా ఉప్పలపాడు పక్షుల కేంద్రం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): పెదకాకాని మండలం ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని వన్యప్రాణి చట్టం –1972 నిబంధనల ప్రకారం.. కన్జర్వేషన్ రిజర్వ్‌గా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి చెప్పారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి వెట్ ల్యాండ్ మేనేజ్మెంట్ సమావేశంలో జేసీ భార్గవ తేజతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ హిమ శైలజ మాట్లాడుతూ ఉప్పలపాడు పక్షుల కేంద్రం 20ఏళ్లుగా అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తోందని వివరించారు. దీనిని కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటించి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. అరుదైన పక్షి జాతులను కాపాడుకోవాలని చెప్పారు. వెట్ ల్యాండ్ ఉపయోగాలను వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు అటవీశాఖ ద్వారా గుర్తించిన 300 వెట్ ల్యాండ్స్‌ను పంచాయతీ రాజ్, ఇరిగేషన్ , ఆర్ డబ్ల్యూఎస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు , రెవెన్యూ స్టేక్ హోల్డర్ శాఖల అధికారులు పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, పశు సంవర్ధక శాఖ జేడీ ఒ.నరసింహా రావు, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకట రత్నం, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కళ్యాణ చక్రవర్తి, డీఎల్‌పీఓ శ్రీనివాస్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ నజీనా బేగం, ఫారెస్ట్ రేంజ్ అధికారులు డి.పోతురాజు, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment