లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు నగరంలోని హజరత్ కాలే మస్తాన్ వలి దర్గాను రావి రామ్మోహనరావు, అతని కుమారుడు మస్తాన్ సాయి వ్యాపార కేంద్రంగా మార్చారని ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షుడు,వక్ఫ్ బోర్డ్ గుంటూరు జిల్లా మాజీ జాయింట్ సెక్రటరీ షేక్ సుభాని, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా ధ్వజమెత్తారు. స్థానిక నగరంపాలెంలోని ముస్లిం సేన రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రావి రామ్మోహనరావు కుటుంబానికి ఈ దర్గాకు సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసినా, గత వక్ఫ్ బోర్డులో ఇతనిపై చర్యలు తీసుకోవాలని, షోకాజ్ నోటీస్ ఇచ్చి దర్గాను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినా వక్ఫ్ బోర్డు సీఈఓ కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా సర్కారు, వక్ఫ్ బోర్డు అధికారులు దృష్టి సారించి దర్గాను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మస్తాన్ సాయిపై డ్రగ్స్, మహిళలను మోసం చేసిన కేసులు నమోదయ్యాయని, ఇది దర్గా పవిత్రతకు భంగం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్, మైనార్టీ నాయకుడు సైదా, సత్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment