నేడు చికెన్, ఎగ్‌ఫుడ్ మేళా
గుంటూరు మెడికల్: చికెన్, కోడిగుడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం స్థానిక పట్టాభిపురం స్వామి థియేటర్ గ్రౌండ్‌లో చికెన్, ఎగ్‌ఫుడ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఒ.నరసింహారావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూపై అనేక వదంతులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు కోడి మాసం, గుడ్లు తినేందుకు భయపడుతున్నారన్నారు. ప్రజలు ఫుడ్‌మేళాకు విచ్చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు. గుంటూరు జిల్లా ఫార్మర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు ఫుడ్‌మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
టీటీడీ సభ్యుడిపై చర్యలు తీసుకోండి
ప్రభుత్వాన్ని కోరిన బొందిలి రాష్ట్ర నాయకులు
నరసరావుపేట: శ్రీ వెంకటేశ్వరుడు నిలయమైన తిరుమల ఆలయంలో మహా ద్వారం వద్ద విధు లు నిర్వహిస్తున్న బాలాజీ సింగ్‌పై టీటీడీ పాలకవర్గ సభ్యుడు నరేష్‌కుమార్ అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడటాన్ని ఏపీ రాష్ట్ర బొందిలి సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక కార్యాలయంలో గురువారం సంఘ నాయకులు సమావేశమయ్యారు. సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొందిలి శ్రీనివాస సింగ్ మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఉద్యోగిపై నరేష్‌కుమార్ ‘‘నిన్ను ఎవరు ఇక్కడ పెట్టించింది.. ఏమనుకుంటున్నావు.. నీ సంగతి చూస్తా.. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా? నువు ముందు బయటికి పో’’ అంటూ దూషించడం దారుణమని తెలిపారు. వెంటనే నరేష్ కుమార్ క్షమాపణ చెప్పాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించి పాలకవర్గ సభ్యుడుగా ఉన్న అతడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంఘ నేతలు డి.ఖాసిం పీరా, ముంటి నాగమల్‌సింగ్, చావలి మురళి, చిందే నాగేశ్వరరావు పాల్గొన్నారు.
22,23 తేదీల్లో జిల్లాస్థాయి క్రీడా పోటీలు
పెదకూరపాడు: పల్నాడు జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహిస్తున్నామని జన చైతన్య సమితి కో–ఆర్డినేటర్ వెలితోటి అనిల్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెహ్రూ యువ కేంద్రం, జన చైతన్య సమితి ఆధ్వర్యంలో వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, లాంగ్ జంప్ క్రీడాంశాల్లో పెదకూరపాడులోని జీఆర్ సీఆర్‌కే శ్రీ చైతన్య స్పోర్ట్స్ అకాడమీ క్రీడా ప్రాంగణంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. విజేతలకు ప్రభుత్వ సర్టిఫికెట్లతో పాటు, షీల్డ్‌లను కూడా బహూకరించనున్నట్లు తెలియజేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. వివరాలకు 8886777767, 9848977677, 8008094045 నంబర్లలో సంప్రదించాలని అనిల్ కుమార్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment