‘సాయం పేరిట ఖర్చు’పై
సాక్షి ప్రతినిధి, గుంటూరు: విజయవాడ బుడమేరు బాధితులకు గుంటూరు కార్పొరేషన్ తరఫున చేసిన సాయం దారి మళ్లించారనే అనుమానాల నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టులో తేల్చుకోవడానికి డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సిద్ధం అయ్యారు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది సోమవారం విచారణకు రానుంది. వరద బాఽధితుల పేరుతో ఎవరి అనుమతి లేకుండానే మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఏకపక్షంగా ఖర్చు చేయడమే కాకుండా, రూ.9.22 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కౌన్సిల్‌లో ప్రశ్నించగా ఆ అంశం చర్చకు రాకముందే అధికారులు మరో అంశంపై కౌన్సిల్‌ను బాయ్‌కాట్ చేశారు. తర్వాత కౌన్సిల్ సమావేశం పెట్టడానికి ముందుకు రాకుండానే స్థాయీ సంఘం ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. అధికారులు చూపిన లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఖర్చు పెట్టిన మొత్తం రూ.కోటిన్నర కూడా దాటదని పిటిషన్‌లో డైమండ్ బాబు పేర్కొన్నారు. మున్సిపల్ మంత్రి నుంచి తమకు వచ్చిన ఫోన్ ఆదేశాల మేరకు సహాయం అందించామని మున్సిపల్ కమిషనర్ పేర్కొంటే, గుంటూరు జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి రాసిన లేఖలో దీనికి విరుద్ధంగా ఉందన్నారు. ఇంత మొత్తం ఖర్చు చేయాలంటే కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోదం తీసుకోవాలని గుర్తుచేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి ఆడిట్, విచారణ నిర్వహించి దారి మళ్లించిన మొత్తాన్ని మున్సిపల్ కమిషనర్ నుంచి రికవరీ చేయాలని కోరారు. కిందిస్థాయి ఉద్యోగులకు రూ.1.59 కోట్లను అడ్వాన్స్ కింద చెల్లించడం కూడా చట్టవిరుద్ధమైనందున క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాలని విన్నవించారు.
అడ్డగోలుగా లెక్కలు...
బుడమేరు వరదల బాధితుల కోసం ఎప్పటికప్పుడు కృష్ణా కలెక్టర్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దశలవారీగా రూ.87 కోట్ల వరకు ఇచ్చింది. ఆ సమయంలో గుంటూరు కమిషనర్ కూడా మున్సిపల్ నిధుల నుంచి అత్యవసర సహాయం కోసం అంటూ కౌన్సిల్ అనుమతి లేకుండా రూ.9.22 కోట్లు ఖర్చు చేశారు. ఫుడ్ ప్యాకెట్లు తయారీకి వస్తువులను ఏ విధంగా సేకరించారనే విషయాన్ని రహస్యంగా ఉంచారు. 17 లక్షల ఫుడ్ ప్యాకెట్లకు కేవలం 3,31,800 వాటర్ బాటిల్స్ మాత్రమే పంపామనడం అనుమానాలకు తావిస్తొందని రిట్‌లో పేర్కొన్నారు. కేవలం ఎనిమిది వేల గోనె సంచులు ఈ ఫుడ్ ప్యాకెట్లు పంపడానికి కొనుగోలు చేయడం కూడా అనుమానాలను పెంచుతోందని తెలిపారు.
దాఖలు చేసిన గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు
అనుమతి లేకున్నా...
వాస్తవానికి గుంటూరు నగరపాలక సంస్థలో ఒక కమిషనర్‌కు రూ. పది లక్షల వరకే సొంతంగా ఖర్చు చేయడానికి అధికారం ఉంది. స్టాండింగ్ కమిటీ అనుమతితో రూ. 50 లక్షల వరకూ ఖర్చు చేయవచ్చు. అంతకు మించి రూపాయి ఖర్చు చేయాలన్నా కౌన్సిల్ ఆమోదం ఉండాల్సిందే. అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమోదం తీసుకుని ఈ పని చేయాల్సి ఉంది. అయితే ఆ పని చేయలేదు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు. మంత్రికి కూడా ఎటువంటి సమాచారం లేదు. కనీసం ఇన్ని లక్షల ప్యాకెట్లను తయారు చేసి పంపుతున్న సమాచారం కూడా ఇక్కడి మీడియాకు ఇవ్వలేదు. ఇదంతా సీక్రెట్‌గా జరిగిపోయింది. గుంటూరులో తయారు చేసిన ఫుడ్ ప్యాకెట్లు ఎక్కడికి సరఫరా చేశారు? ఎవరు అందుకున్నారు? ఎక్కడ పంపిణీ చేశారు? వంటి సమాచారం అసలు లేదు. ఇవే విషయాలను డైమండ్ బాబు తన పిటిషన్‌లో పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment