అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
లక్ష్మీపురం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పక ఓటెయ్యాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కోరారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఓటర్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టరేట్ నుంచి నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలసి జేసీ జెండా ఊపి ప్రారంభించారు. హిందూ కళాశాల వరకు ర్యాలీ సాగింది. అనంతరం జేసీ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముందుగానే పోలింగ్ స్టేషన్ వివరాలను ఓటర్లు తెలుసుకోవాలని సూచించారు. ఓటర్ల సహాయార్థం ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశామని నగరపాలక కమిషనర్ తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి షేక్.ఖాజావలి మాట్లాడుతూ.. 15 రోజులుగా అవగాహన కల్పించేందుకు మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. గుంటూరు ఆర్‌డీఓ శ్రీనివాసరావు, జీఎంసీ అదనపు కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, వెంకట కృష్ణయ్య, సీహెచ్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ దుర్గాబాయి, డీఎస్‌డీఓ సంజీవ రావు, వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
వరికపూడిశెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి
వినుకొండ : వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణానికి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో నిధులు కేటాయించి, పనులు మొదలు పెట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎం నాయకులు వై.వెంకటేశ్వరరావు, షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రాజెక్టు నిర్మాణాలకు శంకుస్థాపన మాత్రమే చేసి, పనులు మొదలు పెట్టడం లేదని తెలిపారు. వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం చిత్తశుద్ధితో బడ్జెట్‌లో నిధులు కేటాయించి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వి.కోటానాయక్, తోట ఆంజనేయులు, న్యాయవాదులు పి.జె.లూకా, మూర్తి, ప్రజాసంఘాల నాయకులు రూబెన్, ఆర్.కృష్ణానాయక్, రాంజీనాయక్, కె.హనుమంతరెడ్డి, రెడ్డిబోయిన ప్రసన్నకుమార్, రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment