కిడ్నాప్, హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్ట్
తెనాలి రూరల్: కలప వ్యాపారిని కిడ్నాప్ చేసి, హత్యాయత్నం చేసిన కేసులో కౌన్సిలర్ సహా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ఎస్. రమేష్‌బాబు వివరాలు వెల్లడించారు. పట్టణ బాలాజీరావుపేటకు చెందిన షేక్ మస్తాన్‌వలి మార్కెట్ ఏరియాలో టింబర్ డిపో నడుపుతున్నాడు. ఇతన్ని పట్టణానికి చెందిన కౌన్సిలర్ మొగల్ అహ్మద్ కొంత కాలంగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. నిరాకరించడంతో కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 5వ తేదీన గుంటూరుకు చెందిన తనకు పరిచయస్తులైన ముగ్గురు వ్యక్తులతో కలసి తెనాలి వచ్చి, ఇక్కడి పడమర కాల్వకట్ట రోడ్డులోని ఓ కోత మిషన్ వద్ద ఉన్న మస్తాన్ వలిని కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లాడు. కారులో దాడి చేసుకుంటూ తక్కెళ్లపాడు తీసుకెళ్లి అక్కడ హైవే పక్కన పెట్రోలు బంకులో కారులో రూ. ఐదు వేలకు డీజిల్ కొట్టించి మస్తాన్‌వలితో బలవంతంగా డబ్బు కట్టించారు. అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లి భవానీపురంలో మద్యం, కిళ్లీలు బాధితుడితో కొనుగోలు చేయించి అతన్ని చిత్రహింసలు పెడుతూ పలు ప్రదేశాల్లో తిప్పారు. తనని, తన కుటుంబాన్ని అంతం చేస్తామని నిందితులు బెదిరించడంతో డబ్బు ఇచ్చేందుకు బాధితుడు అంగీకరించాడు. తెనాలి తీసుకువచ్చి బాలాజీరావుపేటలో కారులో నుంచి బయటకు నెట్టేసి వెళ్లిపోయారు. గాయాలతో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చేరిన మస్తాన్‌వలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ ఎస్‌ఐ నక్కా ప్రకాశరావు కేసు నమోదు చేశారు. సీఐ రమేష్‌బాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. బాలాజీరావుపేట వద్ద అహ్మద్ ఉన్నాడన్న సమాచారంతో ఎస్‌ఐ, సిబ్బంది పి. మురళి, కె. బాబురావు, ఎస్. జయకర్, ఎన్. శ్రీనివాసరావు, డి. సురేష్‌బాబులు వెళ్లి అతన్ని, నిందితుల్లో ఒకడైన గుంటూరు బ్రాడీపేటకు చెందిన డిగ్రీ విద్యార్థి షేక్ రెహమాన్‌ను అరెస్టు చేశారు. కిడ్నాప్‌నకు వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులైన గుంటూరుకు చెందిన షేక్ ఇర్ఫాన్ అలియాస్ హైదరాబాద్, షేక్ హుమయూన్ అలియాస్ చిష్టి పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని డీఎస్పీ బి. జనార్దనరావు అభినందించారు. సమావేశంలో ఎస్‌ఐ ప్రకాశరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment