నేత్రపర్వం.. మల్లేశ్వరుని రథోత్సవం
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీ గంగాభ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం అనంతరం గురువారం స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య తీసుకు వచ్చి రథంపై అధిష్టింప చేశారు. స్వామివారిని, రథాన్ని రంగు రంగుల పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. రథోత్సవంలో రథం ఎదుట ఆనవాయితీగా శాలివాహనులు కుంభం వారబోశారు. మేళతాళాలు, కనక తప్పెట్లు, విచిత్ర వేషధారణలో బాణసంచా పేలుళ్ల మధ్య రథోత్సవం సాగింది. దేవస్థానం నుంచి మెయిన్ బజారు, సాధుసోడా సెంటర్, పూల మార్కెట్ సెంటర్ మీదుగా మిద్దె సెంటర్ వరకు వెళ్లి తిరిగి అదే మార్గంలో దేవస్థానానికి చేరుకుంది. రథంపై గంగా భ్రమరాంబ సమేతుడై పురవీధుల్లోకి వేంచేసిన మల్లేశ్వరుడిని ఆయా సెంటర్లలో భక్తులు దర్శించుకుని టెంకాయలు కొట్టి కర్పూర నీరజనాలు సమర్పించారు. ఈ రథోత్సవానికి కై ంకర్యపరులుగా వేలూరి శివావధానులు, సురేష్‌బాబు, రమేష్‌బాబు, సాయిబాబు, శివరామకృష్ణ శాస్త్రి, సుబ్రహ్మణ్యాలు వ్యవహరించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవస్థాన ఈవో జేవీ నారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రథోత్సవంలో మంత్రి నారా లోకేష్
శివరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణ, అశేష జన సందోహం మధ్య రథోత్సవంలో పాల్గొన్న మంత్రి రథాన్ని లాగారు.
నేత్రపర్వం.. మల్లేశ్వరుని రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment