జిల్లాలో పోలింగ్ ప్రశాంతం
ఎన్నికల రిటర్నింగ్ అధికారి,
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
లక్ష్మీపురం: ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లోని కంట్రోల్ రూము నుంచి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్, లైవ్ ఫీడ్‌ను సంయుక్త కలెక్టర్ ఏ.భార్గవ్‌తేజ, డీఆర్‌ఓ ఎన్.ఎస్.కె.ఖాజావలితో కలిసి కలెక్టర్ నిరంతరం పర్యవేక్షించారు. గుంటూరు జిల్లాలో 71,836 మంది (66.45 శాతం), బాపట్ల జిల్లాలో 18,198 (74.30 శాతం), పల్నాడు జిల్లాలో 44,263 (77.33 శాతం) మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.
పోలింగ్ కేంద్రాలను
పరిశీలించిన ఎస్పీ
తెనాలిరూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ గురువారం పరిశీలించారు. పోలింగ్ సరళి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. జిల్లాలో ఎనిమిది కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించామని, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. లింగారావు సెంటరులోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఎస్పీ అక్కడ సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట డీఎస్పీ బి.జనార్ధనరావు, టూ టౌన్ సీఐ రాముల నాయక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment