ని‘బంధన’లు దాటితే వాతలు
ప్రమాదాలు కళ్ల ముందే కనపడుతున్నా, ప్రాణాలు పోతున్నా, వాహనదారులు నిబంధనలను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ముగ్గురు ద్విచక్ర వాహనంపై ఎక్కకూడదని నిబంధనలు ఉన్నా పట్టించుకోవడం లేదు. నలుగురు అంతకు మించి కూడా ప్రయాణం కొనసాగిస్తున్న దృశ్యాలు నగరంలో కనపడుతున్నాయి. హెల్మెట్ ధారణ లేక ప్రమాదాల్లో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని కళ్లకు స్పష్టంగా కనపడుతున్నా మార్పులేదు. రోడ్లు రక్తమోడుతున్నా, కుటుంబాలు తల్లడిల్లిపోతున్నా పట్టించుకోని పరిస్థితులు దాపురిస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తెచ్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నగరంలో పోలీసులు అమలు చేయనున్నారు.
పట్నంబజారు: ఇప్పటికే గతంలో హైకోర్టు ఉత్తర్వులతో అనేక రకాల ప్రదర్శనలతో అవగాహన కల్పించిన పోలీసు అధికారులు ఇక యాక్షన్‌లో దిగనున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే ధ్యేయంగా భారీ చలానాలతో, వాహనదారులకు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు సన్నద్ధమయ్యారు. నెల రోజుల వ్యవధిలోనే గుంటూరు నగరంలో 20 మందికిపైగా మృత్యువాత పడ్డారు. స్వయంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ ప్రమాదాల గురించి చేపట్టిన ప్రదర్శనల్లో పాల్గొని అవగాహన కల్పించిన పరిస్థితులున్నాయి. అయినా మార్పు లేదు. ఈ నేపథ్యంలో నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు పోలీసులు దృష్టి సారిస్తున్నారు.
హైకోర్టు అక్షింతలు
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా గత ఏడాది జూన్ నుంచే నూతన రహదారి భద్రతా నియమాలు అమల్లోకి వచ్చాయి. అయినప్పటికీ పోలీసులు వాటిని అంతంత మాత్రంగానే అమలు చేశారని చెప్పాలి. ఈ క్రమంలో గతంలో హైకోర్టు సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంది. పోలీసులు, ఆర్టీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అక్షింతలు వేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ఏడాది మార్చి 1 నుంచి పక్కాగా అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జరిమానాల గురించి అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు కూడా జారీ చేశారు. గతంలో మైనర్లు వాహనం నడిపితే చిన్నాచితక జరిమానాలతో సరిపోయేది. ఇప్పుడిక అలా కుదరదు. మైనర్లు వాహనాలు నడిపితే రూ. 25వేలు జరిమానాతో పాటు తల్లిదండ్రులపై కేసులతో పాటు మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసుల చర్యలు నేటి నుంచి నూతన చట్టాలు అమలు మోగనున్న జరిమానాలు మోత నేటి నుంచి స్పష్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నెల రోజుల వ్యవధిలో గుంటూరు నగరంలో జరిగిన ప్రమాదాల్లో 20 మంది మృతి మైనర్లు, యువకులే అధికం
ప్రమాదాల నివారణే లక్ష్యం
ముఖ్యంగా మైనర్లు, యువకులే ద్విచక్ర వాహనాల ప్రమాదంలో మృత్యువాత పడుతున్నారు. ఒకటికి పలుమార్లు చెబుతున్నప్పటికీ ఫలితం లేదు. తల్లిదండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇవ్వడం బాధాకరం. ఇప్పటికే అధికారులకు పలు సూచనలు చేశాం. మలుపులు, సర్కిళ్ల వద్ద నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నిబంధనలు పాటించపోతే మాత్రం చట్టప్రకారం జరిమానాలు తప్పవు. నేటి నుంచి చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. –ఎం. రమేష్, డీఎస్పీ, ట్రాఫిక్
ని‘బంధన’లు దాటితే వాతలు
ని‘బంధన’లు దాటితే వాతలు
Comments
Please login to add a commentAdd a comment