రజకులకు బడ్జెట్‌లో అన్యాయం
బాపట్ల: లాండ్రీలు, దోబీఘాట్ల విద్యుత్ అవసరాలకు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బాపట్ల వచ్చిన జయ రాం స్థానిక మీడియాతో మాట్లాడుతూ టీడీపీ రజకులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందన్నారు. రజకుల నిర్మాణాత్మకమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వటం లేదన్నారు. లాండ్రీలకు ఇచ్చే 150 యూనిట్లకు, దోబీ ఘాట్లకు ఇచ్చే ఉచిత విద్యుత్ అవసరాలకు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై రాష్ట్రంలో రజకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారన్నారు. రజకులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. ఆర్థిక భారం పడని హామీలు నెరవేర్చే అవకాశం ఉన్నా, రజకులకు మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. కూటమిది పెత్తందారుల ప్రభుత్వం కాబట్టే రజకుల ఈనాం భూముల అన్యాక్రాంతంపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. రజకులకు ప్రత్యామ్నాయ భూములను కేటాయించడం లేదన్నారు. జగనన్న కాలనీలు, జగనన్న టౌన్స్ పేరుతో సేకరించిన కమ్యూనిటీ స్థలాల్లో రజకుల వృత్తి అవసరాలకు ప్రత్యేక స్థలాలను కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కొత్తగా పడే ఆర్థిక భారం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయూత కింద రజక వృత్తిదారులకు రూ.10 వేలు ఇచ్చారని, టీడీపీ పాలనలో రజకులు నిండా మోసపోయారని మండిపడ్డారు.
సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొటికలపూడి జయరాం
Comments
Please login to add a commentAdd a comment