లింగంగుంట్ల భూ సమస్య పరిష్కారానికి మళ్లీ యత్నం
నరసరావుపేట: మండలంలోని లింగంగుంట్ల పుష్పగిరి పీఠం అగ్రహారం భూముల సమస్య పరిష్కారం కోసం మరోసారి ప్రయత్నం జరిగింది. ఆదివారం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి లింగంగుంట్ల గ్రామ నాయకులు హైదరాబాదులోని పుష్పగిరి స్వాముల వారిని కలిసి చర్చించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో స్వాముల వారికి, రైతుల మధ్య ఓ అంగీకారం కుదిరిన విషయం విధితమే. దీనిపై ఇరువర్గాల మధ్య ఒక అగ్రిమెంట్ కూడా కుదిరింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా మళ్లీ భూముల విషయమై స్వాముల వారిని కలిసి చర్చించారు. మఠానికి ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్వాముల వారు కోర్టు తీర్పు మేరకు రైతుల ఆధీనంలో ఉన్న తమ భూములు తమకు కావాల్సిందేనని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే చర్చలు నంతరం త్వరలో భూముల రిజిస్ట్రేషన్ జరగనున్నట్లుగా టీడీపీ నాయకులు ప్రకటించటం గమనార్హం. ఏమవుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది. స్వాముల వారిని కలిసిన వారిలో మాజీ సర్పంచ్ పొన్నపాటి ఈశ్వరరెడ్డి, యన్నం రవీంద్రరెడ్డి, గుంగుల పెద్దిరెడ్డి, పొన్నపాటి వెంకటేశ్వరరెడ్డి, డాక్యుమెంట్ రైటర్ ఏరువ బాలమోహనరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment