ఆకట్టుకున్న గ్రామీణ కళారూపాలు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లలో ఐదు చోట్ల ప్రదర్శించిన సంప్రదాయ గ్రామీణ కళారూపాలు భక్తులను, యాత్రికులను ఆకట్టుకున్నాయని మంచి చిత్రాల అభిమాన సంఘం ప్రతినిధులు ఈదర గోపీచంద్, కంచర్ల నాగవీరయ్యలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాలివాహన సత్రంలో కావూరు గ్రామానికి చెందిన కళాకారులు గొట్టం ఆంజనేయులు దర్శకత్వంలో ప్రదర్శించిన బ్రహ్మం గారి నాటకం అలరించిందని తెలిపారు.
కాకతీయ కళావేదికపై సినిమా పాటల కచేరీతోపాటు గయోపాఖ్యానం, శ్రీకృష్ణ రాయబారం, రామాంజనేయ యుద్ధం పౌరాణిక పద్య నాటకాలు ప్రదర్శించారని పేర్కొన్నారు. అలాగే దివ్యాంగ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాటల కచేరీ, మిమిక్రీ, ఏకపాత్రాభినయాలు ఆకట్టుకున్నాయని తెలిపారు. కావూరు ప్రభ వద్ద మహిళా కోలాటం, భట్రాజు సత్రంలో బ్రహ్మంగారి నాటకాన్ని ప్రదర్శించారని చెప్పారు. త్వరలో పట్టణంలో నిర్వహించే అభినందన సభలో వారిని సత్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో సాంస్కృతిక వేదికపై ప్రదర్శనలు ఇవ్వలేకపోయామని పద్య కవి, నటులు ఈవూరి వెంకటరెడ్డి వాపోయినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment