గుంటూరు మెడికల్: బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. అవయవాలను వైద్యులు ప్రత్యేక విమానంలో పలు ఆసుపత్రులకు తరలించి పలువురికి ప్రాణదానం చేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు స్తంభాలగరువు ఎల్‌ఐసీ కాలనీకి చెందిన చెరుకూరి సుష్మ (47) అనారోగ్యంతో ఈనెల 23న గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌లో చేరారు. చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అవడంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆస్టర్ రమేష్ హాస్పటల్ యాజమాన్యం మంత్రి నారా లోకేష్‌ను సంప్రదించారు. వెంటనే ఆయన ప్రత్యేక విమానాన్ని గన్నవరంలో ఏర్పాటు చేయించారు. రమేష్ హాస్పిటల్ నుంచి గ్రీన్ చానల్ ద్వారా అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్‌కు గుండెను, చైన్నె ఎంజీఎం హాస్పిటల్‌కు ఊపిరితిత్తులను, విజయవాడ కామినేని హాస్పటల్‌కు ఒక కిడ్నీ, గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగికి కిడ్నీ, ఒకరికి లివర్ అమర్చి వారికి ప్రాణదానం చేశారు. ఈ ప్రక్రియలో రమేష్ హాస్పిటల్ డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత, బిజినెస్ క్లస్టర్ హెడ్ డాక్టర్ యలవర్తి కార్తిక్ చౌదరి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సాయికుమార్, ఐసీయూ స్పెషలిస్ట్ డాక్టర్ శిల్ప పాల్గొన్నారు.
బ్రెయిన్ డెడ్ అయిన మహిళ
చెరుకూరి సుష్మ అవయవ దానం
పెద్ద మనస్సుతో అంగీకరించిన
కుటుంబసభ్యులు
సుష్మ..యూ ఆర్ గ్రేట్ !