
జోరుగా రిజిస్ట్రేషన్లు.. భారీగా ఆదాయం
మంగళగిరి టౌన్: మంగళగిరిలో సెలవురోజు కూడా రిజిస్ట్రేషన్లు ఆగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం, సోమవారాలు సెలవు దినాలైనా ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఈ రెండు రోజులు పనిచేశాయి. ఇందులో భాగంగా మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆదివారం ఒక్కరోజే 24 రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.కోటి 1 లక్ష ఆదాయం వచ్చిందని, సోమవారం 18 రిజిస్ట్రేషన్లు జరగా 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. భూములు, పొలాలు, ఇళ్లు రిజిస్ట్రేషన్లు భారీగా క్రయ విక్రయాలు జరిగాయి. ఆదివారం ఒక్కరోజే రూ.కోటికిపైగా ఆదాయం వచ్చింది. ఉగాది, ఆదివారం అయినప్పటికీ కొనుగోలు దారులు వెనక్కి తగ్గలేదు. ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కావడంతోసెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేశాయి. దీంతో పొలాలు, స్దలాలు, ఇళ్లు భారీగా కొనుగోలు జరిగాయి. 2023–2024 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి 161 కోట్ల రూపాయలు ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కాగా 142 కోట్ల రూపాయలు మాత్రమే లక్ష్యాన్ని పూర్తిచేశారు. అదే ఆర్ధిక సంవత్సరంలో 15903 డాక్యుమెంటేషన్లు జరిగాయి. కాగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంగళగిరి సబ్ రిజిష్టర్ కార్యాలయానికి 200 కోట్లు ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 176 కోట్లు లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలో సుమారు 16 వేల డాక్యుమెంటేషన్లు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.