
శంకర్‌విలాస్ బ్రిడ్జిపై అపోహలొద్దు
గుంటూరు వెస్ట్: శంకర్‌విలాస్ బ్రిడ్జి పునర్నిర్మాణంపై ఎవరికీ అపోహలు వద్దని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎస్పీ సతీష్‌కుమార్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి ఆర్‌యూబీ అంశాన్ని కూడా పరిశీలించామని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలరీత్యా ఆర్‌యూబీ స్థానంలో ఆర్వోబీకి మాత్రమే అవకాశం ఉందన్నారు. మొత్తం 900 మీటర్ల పొడవుతో స్థానిక ఏసీ కళాశాల నుంచి అరండల్‌పేట 9వ లైను వరకు ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతోందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ.98 కోట్లు ఇప్పటికే మంజూరు చేసిందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంతోపాటు, అండర్‌పాస్‌లూ నిర్మిస్తామని పేర్కొన్నారు. మొత్తం బ్రిడ్జి నిర్మాణంతో 134 స్ట్రక్చర్లు ఎఫెక్ట్ అవుతాయని వివరించారు. ఇప్పటికే 40 మంది తమ అంగీకారం తెలిపారని, మరికొంత మంది కోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే వారిని కూడా ఒప్పించే యత్నం చేస్తున్నామన్నారు. బ్రిడ్జి వల్ల ప్రభావితం అవుతున్న వారితో మూడు సమావేశాలు నిర్వహించామన్నారు. ఎప్పటికప్పుడు వారి అభిప్రాయాలు తీసుకుంటూ నిర్మాణ డిజైన్ చేపట్టామని పేర్కొన్నారు. బ్రిడ్జి తొమ్మిది మీటర్ల హైట్ ఉంటుందని పేర్కొన్నారు. కొందరు ఆరేడు మీటర్లు సరిపోతుంది కదా అని అంటున్నారని, అయితే ప్రస్తుతం రైళ్లన్నీ ఎలక్ట్రికల్ విధానంలో నడుస్తున్నాయని, వీటి ఎత్తు సుమారు 7 మీటర్లు ఎత్తు ఉంటుందని వెల్లడించారు. దీంతో తొమ్మిది మీటర్ల ఎత్తు నిర్మాణం తప్పనిసరని స్పష్టం చేశారు. నిర్మాణంతో నష్టపోయేవారికి చెల్లించే పరిహారం కూడా చట్టానికి లోబడి ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం కొత్త బ్రిడ్జి నిర్మించకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం : ఎస్పీ
సమావేశంలో ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైన నాలుగు నెలల నుంచి ఆరు నెలల వరకు బ్రిడ్జిపై రాకపోకలు సాగించవచ్చని పేర్కొన్నారు. నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాతే బ్రిడ్జిని పగులగొడతారని తెలిపారు. అమరావతి, గోరంట్ల నుంచి వచ్చే వాహనాలు ఇన్నర్‌రింగ్ రోడ్డువైపు మళ్లిస్తామన్నారు. వీలైనంత వరకు ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి, ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని వివరించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన అంశాలను ప్లాన్ ద్వారా వివరించారు.
భవిష్యత్తు అవసరాల కోసం
నిర్మాణం తప్పనిసరి
ఎవరికీ ఇబ్బంది లేకుండా
చర్యలు తీసుకుంటున్నాం
కలెక్టర్ నాగలక్ష్మి