గుంటూరు రూరల్: మద్యం మత్తులో వృద్ధుడిని హత్య చేసిన ఘటన రెడ్డిపాలెం సమీపంలో మంగళవారం జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్ కథనం ప్రకారం శారదా కాలనీకి చెందిన దారావత్ రాము (60) ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుని జీవిస్తుంటాడు. ఈ క్రమంలో రెడ్డిపాలెం వద్ద అదే గ్రామానికి చెందిన బట్టు రాజు అనే వ్యక్తితో కలిసి మంగళవారం మద్యం తాగాడు. ఈ సమయంలో వివాదం జరిగింది. దీంతో రాజు ఆవేశంలో మద్యం బాటిల్ పగలగొట్టి రాముపై దాడిచేశాడు. దాడిలో రాము తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన విషయం తెలిసిన సౌత్ డివిజన్ డీఎస్పీ భానోదయ సిబ్బందితో కలిసి ఘటన స్థలికి చేరుకున్నారు. వివరాలను సేకరించిన సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు.