తోడు దొంగలు చిక్కరు..దొరకరు | - | Sakshi
Sakshi News home page

తోడు దొంగలు చిక్కరు..దొరకరు

Apr 3 2025 2:05 PM | Updated on Apr 3 2025 2:05 PM

తోడు దొంగలు చిక్కరు..దొరకరు

తోడు దొంగలు చిక్కరు..దొరకరు

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): ఇద్దరూ తోడు దొంగలు.. ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడంలో నేర్పరులు. సీసీ కెమెరాలకు చిక్కరు.. దొరకరు.. మూడేళ్లలో 13కుపైగా దొంగతనాలు చేసినా ఏ పీఎస్‌ పరిధిలోనూ వీరిపై కేసుల్లేవు. ఎట్టకేలకు నల్లపాడు పోలీసులు వీరి ఆట కట్టించారు. ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద రూ.32 లక్షల విలువ చేసే 390 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను ఎస్పీ సతీష్‌కుమార్‌ బుధవారం నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత నెలలో నల్లపాడు పీఎస్‌ పరిధిలోని లింగయ్యపాలెంలో, గుంటూరు క్లబ్‌ దగ్గర్లో ఒంటరిగా నడిచి వెళ్లే మహిళల మెడల్లో బంగారు గొలుసులను దుండగులు తెంచుకెళ్లారు. దీనిపై సీఐ వంశీధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. ఏటుకూరురోడ్‌ డీఎస్‌ నగర్‌ తొమ్మిదో వీధిలో ఉంటున్న టైలర్‌ వల్లెపు శ్రీనును అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతనిచ్చిన సమాచారంతో వసంతరాయపురం నాలుగో వీధికి చెందిన అన్నపురెడ్డి శివ సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. వీరిద్దరూ కలిసి బంగారు గొలుసుల చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. వీరు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చోరీలు చేసినట్టు తేల్చారు. ఇప్పటివరకు 13కుపైగా చోరీలకు పాల్పడినా వీరిపై కేసులు లేవని గుర్తించారు. వీరి వద్ద నుంచి రూ.32 లక్షల ఖరీదు చేసే 390 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. కేసును దర్యాప్తు చేసిన సీఐ వంశీధర్‌, ఎస్‌ఐ జనార్దన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, మస్తాన్‌వలి, బిక్షనాయక్‌, వెంకటేశ్వర్లును ఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సుప్రజ (క్రైం), శిక్షణ ఐపీఎస్‌ అధికారిణి దీక్ష, డీఎస్పీ భానోదయ పాల్గొన్నారు.

గొలుసుల చోరీల్లో దిట్టలు మూడేళ్లలో 13కుపైగా దొంగతనాలు ఏ పీఎస్‌లోనూ కేసుల్లేవు ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు రూ.32 లక్షల విలువ చేసే 390 గ్రాముల బంగారు సొత్తు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement