
సజావుగా జేఈఈ మెయిన్స్
గుంటూరు ఎడ్యుకేషన్ : జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశించేందుకు ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2025 రెండో సెషన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) లకు విద్యార్థులు హాజరయ్యారు. జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సీబీటీ విధానంలో ఆన్‌లైన్ పరీక్షల కోసం గుంటూరులో రెండు, పల్నాడు జిల్లాలో రెండు చొప్పున వివిధ ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు అయాన్ డిజిటల్ జోన్‌లలో ఏర్పాటు చేసిన కేంద్రాల పరిధిలో విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు హడావుడి పడుతూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈనెల 3, 4, 7, 8వ తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్–1 (బీఈ, బీటెక్) ప్రవేశ పరీక్షలు జరగనుండగా, 9వ తేదీన పేపర్–2ఏ బీఆర్క్,పేపర్–2బీ బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి.
గుంటూరు, పల్నాడులోని పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు విస్తృత తనిఖీలు