
12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ కె.నరసింహారావు అన్నారు. ఫ్యాప్టో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తే ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నరసింహారావు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో మరణించిన ఉపాధ్యాయ, ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఖాళీలు లేవనే పేరుతో కాలయాపన చేయడం సరికాదని పేర్కొన్నారు. 12వ వేతన సవరణ(పీఆర్సీ) కాలం ముగిసి, ఇప్పటికే 21 నెలలు గడిచిపోయినా కనీసం కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయలేదని, వెంటనే కమిషన్‌ను ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ కె.వీరాంజనేయులు మాట్లాడుతూ 2003 డీఎస్పీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఫ్యాప్టో మాజీ చైర్మన్ సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలు చేయనందున ఉపాధ్యాయులకు డెప్యూటీ డీఈఓ, డైట్ ప్రిన్సిపాల్, డీఈఓ పోస్టులు అందని ద్రాక్షలా మిగిలిపోయాయని, తక్షణమే జీఓలు 73, 74, 75 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. బసవలింగరావు మాట్లాడుతూ తెలుగు మీడియంను కనీసం సమాంతర మీడియంగానైనా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి పడిన మూడు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అడిషనల్ సెక్రటరీ జనరల్ యు.రాజశేఖర రావు మాట్లాడుతూ సరెండర్ లీవ్ బకాయిలతోపాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో ఫ్యాప్టో కో–చైర్మన్ షేక్ ఫైజుల్లా, ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ డీకే సుబ్బారెడ్డి, మహమ్మద్ ఖలీద్, ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యులు కళాధర్, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ రామచంద్రయ్య, యూటీఎఫ్ సీనియర్ నాయకులు ఎం.హనుమంతరావు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కరీముల్లా, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌కొండయ్య, ఫ్యాప్టో భాగస్వామ్య పక్షాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ తేజకు వినతి పత్రం అందజేశారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట టీచర్ల నిరసన