
విలువలతో కూడిన బోధనతో విద్యార్థుల్లో వికాసం
గుంటూరు ఎడ్యుకేషన్: విలువలతో కూడిన బోధనతో విద్యార్థుల్లో సమగ్ర వికాసాన్ని అభివృద్ధి పర్చగలమని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. రింగ్ రోడ్డులోని శ్రీ చైతన్య సీవో–ఐపీఎల్ పాఠశాల ద్వితీయ వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ సాంకేతిక విద్యా బోధనకు శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో సీవో–ఐపీఎల్ పాఠశాలను నెలకొల్పడం అభినందనీయమన్నారు. విద్యార్థులు సత్ప్రవర్తనతో సమాజంలో మెలుగుతూ దేశభక్తిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. అనంతరం విద్యతోపాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో శ్రీచైతన్య ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్, డీన్ శివకుమార్, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, ఇన్‌చార్జ్‌లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.