
పోరాట యోధుడు పాపిరెడ్డి
గుంటూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ సోషలిస్ట్ ఫ్రంట్ యోధుడు మోదుగుల పాపిరెడ్డి (88) ఆదివారం కన్నుమూశారు. ఈయన వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తండ్రి. పాపిరెడ్డి పౌర హక్కుల కోసం జీవితాంతం పోరాడారు.
పాపిరెడ్డి ప్రస్థానం
మోదుగుల పాపిరెడ్డి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో 1937 అక్టోబర్ 9న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన ఎంఏ, ఎల్‌ఎల్‌బీ వరకూ చదివారు. 1961లో గుంటూరులో న్యాయవాది వృత్తిలో కొనసాగారు. విద్యార్థి దశలోనే ఆయన సోషలిస్ట్ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. సోషలిస్ట్ పార్టీకి తన జీవితాన్ని అంకితం చేశారు. 1955లో రామ్‌మనోహర్ లోహియా గుంటూరుకు వచ్చినపుడు ఆయన ప్రసంగాలతో పాపిరెడ్డి ప్రభావితమయ్యారు. లోహియాకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. సోషలిస్ట్ ఉద్యమ నేతలైన మధుమిమాయో, రాజ్‌నారాయణ్, మధుదండావతే, జార్జి ఫెర్నాండేజ్ తదితరులతో కలిసి జాతీయస్థాయిలో పనిచేశారు. 1975లో లోక్‌నాయక్ జయప్రకాష్‌నారాయణ నిర్వహించిన ఉద్యమంలో పాల్గొని ఐదు నెలలు అజ్ఞాత జీవితం గడిపారు. 1975 నవంబర్ 14న అరెస్టు అయ్యారు. 1977 జనవరి వరకు రాజమండ్రి, సికింద్రాబాద్ జైళ్లలో ప్రభుత్వం ఆయనను నిర్బంధించింది. పాపిరెడ్డితోపాటు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ బి.సత్యనారాయణరెడ్డి, బీజేపీ నాయకులు జూపూడి యజ్ఞనారాయణ, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కాతా జనార్దనరావు తదితరులు జైల్లో కలిసి ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని కాండ్లరేవు సత్యాగ్రహంలో జార్జిఫెర్నాండేజ్‌తో కలిసి పాపిరెడ్డి పాల్గొన్నారు. ఓపీడీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు. కార్మికుల ఆకలిచావులను నిరసిస్తూ 1989లో గుంటూరు కలెక్టరేట్ వద్ద పాపిరెడ్డి ఆమరణ నిరాహార దీక్షను చేశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. పాపిరెడ్డి తెలుగు భాషాభిమాని. తమిళనాడులో హోనూరు, కృష్ణగిరి జిల్లాల్లో పాదయాత్రలు జరిపి తెలుగు భాషాభివృద్ధి కోసం పోరాడారు. బరంపురంలో జరిగిన అఖిల భారత తెలుగు మహాసభల విజయానికి చీఫ్ పాట్రన్‌గా ఎంతో కృషిచేశారు. అఖిల భారత తెలుగు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై భాష కోసం పాటుపడ్డారు.
ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాలు
ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పాపిరెడ్డి ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రజల స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్ హరిస్తుందంటూ గళమెత్తారు. పాపిరెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని అందించింది. వందలాది పురస్కారాలు పాపిరెడ్డిని వరించాయి. ఆయన సేవా కార్యక్రమాల్లోనూ ముందుండేవారు. పెదపరిమి గ్రామంలో ఆర్‌సీఎం స్కూలు కమిటీ కన్వీనర్‌గా పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తాడికొండలో సత్యసాయిబాబా కళాశాల పాలకవర్గ సభ్యుడిగా పనిచేశారు. పెదపరిమి గ్రామంలో వినాయకుడి ఆలయాన్ని నిర్మించారు.
పలువురి సంతాపం
మోదుగుల పాపిరెడ్డి మృతి వార్త తెలిసి గుంటూరు జిల్లాతోపాటు పలు జిల్లాల్లో ఆయన ఆత్మీయులు, అభిమానులు, రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వణుకూరి శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి ఇన్‌చార్జ్ సుధీర్ భార్గవ్‌రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, మోపిదేవి వెంకటరమణ, కోవెలమూడి రవీంద్ర, రాయపాటి శ్రీనివాస్, రావెల కిషోర్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, బీజేపీ నేత జూపూడి రంగరాజు ఉన్నారు.
ఒకే జైలులో ఉన్నాం : యలమంచిలి శివాజీ
పాపిరెడ్డి మృతికి రైతు నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో పాపిరెడ్డి తాను ఒకే జైలులో ఉన్నామని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్ కూడా పాపిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు.
అంబటి నివాళి
పాపిరెడ్డి మృతికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాళి అర్పించారు. పాపిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కూడా పాపిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు.
జీవితమంతా ప్రజల కోసం తపించిన నేత సేవా కార్యక్రమాల్లోనూ ముందు ప్రముఖుల సంతాపం

పోరాట యోధుడు పాపిరెడ్డి

పోరాట యోధుడు పాపిరెడ్డి