
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
గుంటూరు రూరల్: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు గ్రామంలో ఆదివారం జరిగింది. సీఐ రామానాయక్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు అన్నవరపు వసంతరావు (63) తనకున్న కొద్దిపాటి పొలంతోపాటు గ్రామంలో మరో రెండు, మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో గతంలో కొంత అప్పులు ఉన్నా.. ఈ ఏడాది పండించిన పంటలకు మద్దతు ధరలేకపోవటంతో అప్పులు పెరిగిపోయాయి. అప్పుల వాళ్ళ వేధింపులు పెరిగి ఆర్థికంగా దెబ్బతిన్నాడు. మనస్థాపంతో ఈనెల 4న తన పొలంలో కలుపు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలంలో అపస్మారక స్థితిలో పడిఉన్న వసంతరావును కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సంఘటనపై మృతుని కుమారుడు రవి ఫిర్యాదు మేరకు వట్టిచెరుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.