‘లెక్క’జిత్తుల బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

‘లెక్క’జిత్తుల బడ్జెట్‌

Apr 8 2025 7:21 AM | Updated on Apr 8 2025 7:21 AM

‘లెక్

‘లెక్క’జిత్తుల బడ్జెట్‌

● అంతా అంకెల గారడీ ● వైఎస్సార్‌ సీపీ సభ్యుల నిరసన ● కౌన్సిల్లో బడ్జెట్‌ ఆమోదానికి నిరాకరణ ● ఎట్టకేలకు మెజార్టీ సభ్యుల మద్దతుతో బడ్జెట్‌కు ఆమోదం ● వీధి కుక్కల స్వైరవిహారంపై సుదీర్ఘ చర్చ
చిన్నారికి వైఎస్సార్‌ సీపీ నేతల నివాళి

నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌): బడ్జెట్‌ అంతా అంకెల గారడీ అని, నక్కజిత్తుల బడ్జెట్‌ అని వాస్తవ లెక్కలకు బడ్జెట్‌లో పొందుపరిచిన అంకెలకు పొంతన లేదని వైఎస్సార్‌ సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ హాలులో సోమవారం ఉదయం బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. వాస్తవానికి ఈ సమావేశం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఇన్‌చార్జి మేయర్‌ సజిల 11.57 గంటలకు వచ్చి సమావేశాన్ని ఆరంభించారు. సుదీర్ఘ చర్చ అనంతరం మెజార్టీ సభ్యుల మద్దతుతో రూ.1534.27కోట్ల బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

బాలుడి మృతికి సంతాపం

కౌన్సిల్‌ సమావేశంలో తొలుత గుంటూరు స్వర్ణభారతి నగర్‌లో ఆదివారం వీధికుక్క దాడిలో నాలుగేళ్ల బాలుడు ఐజాక్‌ మృతిచెందడంపై సభ్యులు సంతాపం తెలిపారు. అనంతరం వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడుతూ నగరంలో కుక్కల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నగరంలో ఎన్ని కుక్కలు ఉన్నాయో లెక్కలు తేల్చాలని డెప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు(డైమండ్‌ బాబు) ప్రశ్నించారు. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని కార్పొరేటర్‌ మొహమూద్‌ పేర్కొన్నారు. గతంలో డెప్యూటీ మేయర్‌గా ఉన్న ప్రస్తుత ఇన్‌చార్జి మేయర్‌ షేక్‌ సజీల కూడా వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోస్టర్‌ ప్రదర్శించారని కార్పొరేటర్లు సంకూరి శ్రీనివాసరావు, సాంబిరెడ్డి గుర్తుచేశారు. తక్షణం ప్రత్యేక సమావేశం నిర్వహించి వీధికుక్కల నియంత్రణకు యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని డెప్యూటీ మేయర్‌ డైమండ్‌బాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం డిమాండ్‌ చేశారు.

దురదృష్టకర ఘటన

వీధికుక్క దాడిలో బాలుడి మృతి దురదృష్టకరమని కుమిషనర్‌ పులి శ్రీనివాసులు చెప్పారు. నగరంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ(ఏబీసీ) ఆపరేషన్లు జరిగేవని, యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు ఆదేశాలతో అవి నిలిచిపోయాయని వివరించారు. ప్రస్తుత సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లి నగరపాలక సంస్థ తరపున ఏబీసీ ఆపరేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో 31,400 కుక్కలు ఉన్నాయని, వీటలో 4,500 కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు చేశామని,, యాంటీ ర్యాబిస్‌ వ్యాక్సిన్లూ వేశామని వెల్లడించారు. కుక్కలను పట్టుకునేందుకు వెళ్తున్న మున్సిపల్‌ సిబ్బందిపై కొందరు దాడి చేశారని, వారిపై కేసు పెట్టామని పేర్కొన్నారు.

బడ్జెట్‌ తయారీలో లోపాలు

వార్షిక బడ్జెట్‌ తయారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించారని వైఎస్సార్‌సీపీ సభ్యులతో పాటు, కూటమి సభ్యులూ ఆరోపించారు. అసలు బడ్జెట్‌లో పొందుపరిచిన లెక్కలకు వాస్తవిక లెక్కలకు పొంతనే లేదన్నారు. టౌన్‌ ప్లానింగ్‌ ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాది రూ.5 కోట్లు చూపితే ఈ యేడు రూ.10కోట్లు ఏ విధంగా వస్తాయని కార్పొరేటర్‌ అచ్చాల వెంకటరెడ్డి ప్రశ్నించారు. టౌన్‌ ప్లానింగ్‌ నుంచి అసలు ఎంత ఆదాయం వస్తుందని కార్పొరేటర్‌ వేములపల్లి శ్రీరాంప్రసాద్‌ అడిగిన ప్రశ్నకు అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఈ బడ్జెట్‌ తనకేం అర్థం కాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ సభ్యులకు అడ్డంకులు

బడ్జెట్‌ సమావేశంలో వైఎస్సార్‌ సీపీ సభ్యులకు అడుగడుగునా కూటమి సభ్యులు అడ్డంకులు సృష్టించారు. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గలాభా సృష్టించారు. ఖాళీ స్థల పన్నులు, మీడియా డిస్‌ప్లే డివైజ్‌ ఫీజులు, పారిశుద్ద్యం, ట్రేడ్‌ లైసెన్స్‌లు, యూజర్‌ చార్జీలు, ట్యాక్స్‌లు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణలో లోపాలున్నాయని పలువురు సభ్యులు ప్రశ్నించారు. సాయంత్రం వరకు కొనసాగిన బడ్జెట్‌ సమావేశంలో చివరిగా డెప్యూటీ మేయర్‌ బాలవజ్రబాబు బడ్జెట్‌పై పశ్నలను అడిగే క్రమంలో కూటమి సభ్యులు లేచి నిలబడి తాము బడ్జెట్‌ను ఆమోదిస్తున్నామని, తీర్మానం చేయాలని అక్కడి నుంచి వెళ్లేపోయే యత్నం చేశారు. దీంతో ఇన్‌చార్జ్‌ మేయర్‌ సజీల వార్షిక బడ్జెట్‌ ఆమోదం పొందినట్టు ప్రకటించారు. దీనిని వైఎస్సార్‌ సీపీ సభ్యులు ఖండించారు.

బడ్జెట్‌ స్వరూపం ఇలా

రూ.కోట్లలో

ప్రారంభ నిల్వ 670,23,59,195

జమలు 864,04,08,399

మొత్తం 1534,27,67,594

ఖర్చులు 1018,23,16,149

అంత్య నిల్వ 513,04,51,445

‘లెక్క’జిత్తుల బడ్జెట్‌ 1
1/1

‘లెక్క’జిత్తుల బడ్జెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement