
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా
మంగళగిరిటౌన్: చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యాన చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మంగళవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. బాలకృష్ణ మాట్లాడుతూ చేనేత పరిశ్రమ కార్పొరేట్ విధానాల వల్ల సంక్షోభంలో కూరుకుపోయిందని, చేనేత కార్మికులు ఆకలిచావులు, ఆత్మహత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడంతో మరింత సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేతన్న నేస్తం పథకం షెడ్డు కార్మికులకు, సహకార సంఘాలతో నేత నేయిస్తున్న చేనేత కార్మికులకు అమలు జరగలేదని గుర్తు చేశారు. కూటమి నాయకులు ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే చేనేత పరిశ్రమను రక్షిస్తామని, జీఎస్టీ, రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీలు అమలుకావడం లేదని ఎద్దేవా చేశారు. సహకార సంఘాలకు చెల్లించాల్సిన యారన్ సబ్సిడీ, పావలా వడ్డీ రిబేటు, రూ.156 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం చేనేత జౌళి శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.రామారావు, రాష్ట కమిటీ సభ్యులు కె.వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ సీతారామాంజనేయులు, కె.మల్లికార్జునరావు, కె.కుమారి తదితరులు పాల్గొన్నారు.