
భూముల రీ సర్వే ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేయాలి
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ
గుంటూరువెస్ట్: జిల్లాలో భూముల రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో నిర్దేశించిన గ్రౌండ్ ట్రూ థింగ్ వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ శంకరన్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 14 గ్రామాల్లో క్షేత్రస్థాయిలో భూముల రీ సర్వే పూర్తయిందన్నారు. వాటికి సంబంధించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ ప్రక్రియ చాలా కీలకమని, ఎటువంటి తప్పులు లేకుండా వివరాలు నమో దు చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నిర్వహించిన రీసర్వేలో గుర్తించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అధికారుల సందేహాలను ఇన్‌చార్జి కలెక్టర్ నివృత్తి చేశారు.
యార్డుకు 1,44,446 బస్తాలు మిర్చి రాక
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 1,44,446 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,41,802 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,900 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,400 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 66,917 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డులో గురువారం 673 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొమ్ములు 442 బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.11,300, గరిష్ట ధర రూ.12,400, మోడల్ ధర రూ.12,000, కాయలు 231,బస్తాలు వచ్చాయి. వాటి కనిష్ట ధర రూ.11,300, గరిష్ట ధర రూ.12,500, మోడల్ ధర రూ.12,000, మొత్తం 504.750 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు తెలిపారు.