
వక్ఫ్ స్వాతంత్య్ర పోరాటం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): వక్ఫ్ సవరణ బిల్లును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పారు. నినాదాలతో హోరెత్తించారు. వామపక్షాలు, పలు ముస్లిం సంఘాలు ఆందోళనలో పాలుపంచుకున్నాయి. పార్టీలకతీతంగా చేపట్టిన కార్యక్రమం కావడంతో వేదికపై తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కూడా ఉన్నారు. ముస్లింలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అని నినదిస్తూ వామపక్షాల నేతలు పోస్టర్ ప్రదర్శించారు. అదే వేదికపై టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఉండడంతో వామపక్ష నాయకులు అసహనం వ్యక్తం చేశారు. వేదిక దిగిపోయారు. అనంతరం వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన కూటమి పార్టీ నేత, ఎమ్మెల్యే నసీర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. కొద్దిసేపు నసీర్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. వక్ఫ్ బిల్లుకు చంద్రబాబు మద్దతు తెలిపి ముస్లింలకు ద్రోహం చేశారని, ఇప్పుడు ఆ పార్టీ నేత ఆందోళనలో పాల్గొని ద్వంద్వ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తూర్పు మాజీ శాసన సభ్యుడు షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ పార్టీలకతీతంగా అందరం ఐకమత్యంగా వక్ఫ్ సవరణ బిల్లుపై పోరాడాలని కోరారు. జమియతుల్ ఉలెమా అధ్యక్షుడు ముఫ్తి బాసీద్ మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ముస్లింలపై కక్ష కట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ వైఖరిపై ధ్వజమెత్తారు. వక్భ్‌బిల్లుకు వ్యతిరేకంగా శనివారం సీపీఐ ఆధ్వర్యంలో గల్లీ టు ఢిల్లీ నినాదంతో నిరసన చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో ముస్లిం సంఘాల నాయకులు, ఆవాజ్ కమిటీ అధ్యక్షడు చిష్టి, ముస్లిం ఐక్య వేదిక నాయకుడు బాజీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ కార్యదర్శి గులాం రసూల్, సీపీఐ, సీపీఎం నాయకులు, ముఫ్తి, మౌలానా పాల్గొన్నారు.
ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఆందోళన వామపక్షాలు, పలు ముస్లిం సంఘాల మద్దతు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ససీర్ రాజీనామా చేయాలంటూ నినాదాలు
ముస్లింల వెంటే నా ప్రయాణం
టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియామకానికి టీడీపీ ప్రత్యేక శ్రద్ధ వహించిందని పేర్కొన్నారు. ముస్లింల వెంటే తన ప్రయాణమని, పోరాటానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.

వక్ఫ్ స్వాతంత్య్ర పోరాటం