
నేడు పొన్నెకల్లులో అంబేడ్కర్ జయంత్యుత్సవం
తాడికొండ: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవాన్ని సోమవారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎస్పీ సతీష్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. పొన్నెకల్లు ఎస్సీ కాలనీలోని అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రత్యేకంగా రంగులతో అలంకరించారు. ఏర్పాట్లను పరిశీలించిన ఇన్‌చార్జి కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పారిశుద్ధ్య పనులు, వాహనాల పార్కింగ్, బారికేడ్‌లు, హెలీప్యాడ్, సభావేదిక పలు ప్రాంతాలను పరిశీలించారు. సభకు హాజరయ్యే అందరికీ తాగునీరు, స్నాక్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ బ్రహ్మయ్య, డీపీఓ నాగసాయి, తాడికొండ, గుంటూరు పశ్చిమ తహసీల్దార్లు మెహర్ కుమార్, వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సమతావాణి, ఆర్‌ఐ హనుమంతరావు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్‌కు విచ్చేసినప్పటి నుంచి సభ అనంతరం తిరిగి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సతీష్ కుమార్ సిబ్బందికి సూచించారు. ఆదివారం పొన్నెకల్లులో సీఎం పర్యటన బందోబస్తుపై సిబ్బందికి విధుల కేటాయింపు అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కేటాయించిన ప్రదేశాల్లో భద్రతా బృందాలు విధులు సమర్థంగా నిర్వహించాలన్నారు. తనిఖీలు క్షుణ్ణంగా చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జీవీ రమణమూర్తి, ఏటీవీ రవికుమార్, సుప్రజ, ఎ.హనుమంతు, తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ, తాడికొండ సీఐ వాసు పాల్గొన్నారు.
పాల్గొననున్న సీఎం చంద్రబాబు
ఏర్పాట్లను పరిశీలించిన
ఇన్‌చార్జి కలెక్టర్
అధికారులకు సూచనలు