
గోవుల మృతిపై విచారణ చేపట్టాలి
చినకాకాని(మంగళగిరి): తిరుపతిలో గోవుల మృత్యువాతపై ప్రభుత్వం విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాల్సిందిపోయి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ మంటలు సృష్టిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. చినకాకానిలో జరుగుతున్న జనసేవాదళ్ శిక్షణ తరగతులకు హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ తిరుపతిలో లడ్డూ కల్తీ అయిందని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రంలో ప్రధానిగా ఉన్న మోదీ 11 ఏళ్లలో హిందువులకు ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చాక రూపాయి విలువ పడిపోయిందని విమర్శించారు. ప్రధాని అదానీ, అంబానీలకు దోచి పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ మోదీ పాలనలో మహిళలపై దాడులు, లైంగిక దాడులు పెరిగిపోయాయన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు జంగాల అజయ్‌కుమార్, చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్‌బాబు, గని, ఆరేటి రామరావు పాల్గొన్నారు.