
ముగిసిన సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు గత రెండు రోజులుగా జరుగుతున్న వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం గురువారంతో ముగిసింది. సమావేశంలో ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలు పంటల్లో పరిశోధనలు, సాధించిన ప్రగతి, నూతన టెక్నాలజీ, మినీకిట్లు వంటి అంశాలపై చర్చించి సమాచారాన్ని అందించారు. యాంత్రీకరణపై శాస్త్రవేత్తలతో ప్రత్యేక చర్చా కార్యక్రమం, గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. వరి పంటలో బీపీటీ 5204 నాణ్యత కలిగిన సన్నగింజ రకాలు ఎగుమతికి అనువైనవని, 7 మిల్లీ మీటర్ల గింజ పొడవుగల వరి రకాలు, కలర్డ్ వరి రకాలపై పరిశోధనలు చేయాలని, అధిక దిగుబడిని ఇచ్చే తక్కువ ఎత్తుగల మొక్క జొన్న, జొన్న, హైబ్రిడ్స్ అపరాలలో కలుపు యాజమాన్యం, శనగలో పోస్ట్ ఎమర్‌జెన్స్ కలుపు మందులు, కాండం తొలిచే పురుగులు, గజ్జి తెగులు యాజమాన్యం, తెగుళ్లను తట్టుకునే మినుము రకాలపై పరిశోధనలు చేపట్టాలని పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యంపై, ట్రాష్ షెడ్డర్ ద్వారా పంట వ్యర్థాల వినియోగం వటి అంశాలపై రైతులకు అవగాహన పెంచాలని విస్తరణ సంచాలకులు డాక్టర్ జి. శివన్నారాయణ తెలిపారు. చెరకు విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోతున్న సందర్భంగా డ్రయ్యర్‌లు రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. చెరకులో యాంత్రీకరణను పెంచి కూలీల ఖర్చు తగ్గించినపుడే పంటలో ఆశించిన లాభం వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.