
హోరాహోరీగా అండర్–17 బాలుర వాలీబాల్ పోటీలు
సత్తెనపల్లి: పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ 54వ హైదరాబాద్ రీజియన్ స్థాయి అండర్–17 బాలుర వాలీబాల్ పోటీలు శనివారం హోరాహోరీగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి (రామకృష్ణాపురం)లోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ఆవరణలో అండర్ –17 బాలుర వాలీబాల్ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించారు. పోటీల్లో క్రీడాకారులు నువ్వా .. నేనా అన్నట్లు తలపడ్డారు. పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 18 జట్లు హాజరయ్యాయి. శనివారం రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగులో కూడా పోటీలు కొనసాగించారు. ఎనిమిది జట్లు ఖమ్మం, సత్తెనపల్లి, హక్కింపేట్, విజయవాడ–1, తెనాలి, వెంకటగిరి, వాల్తేరు, కర్నూల్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ పోటీలు నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం చేపడుతామని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ సత్తెనపల్లి ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ బి.కిరణ్‌రెడ్డి తెలిపారు. పంజాబ్‌లో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ జట్టును కూడా ఇక్కడ ఎంపిక చేయనున్నారు.
అలరించిన
‘మహా మంజీరనాదం’
నగరంపాలెం: స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో అన్నమయ్య కళావేదికపై శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో భాగంగా మహామంజీర నాదం–2025 శనివారం కొనసాగాయి. పాలక మండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేయగా, సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం సుమంగళ ప్రభు (కర్ణాటక) భరతనాట్యం, దేబ్‌జనిబసు (కలకత్తా) కథక్, జెపీ కనిష్క (హైదరాబాద్), కూచిపూడి నృత్యం సభికులను అలరించాయి. కళాకారులను సంస్థ కార్యదర్శి డాక్టర్ కాజ వెంకటసుబ్రహ్మణ్యం కళాకారులను యువ కళారత్న పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో వీవీఐటీ విశ్వ విద్యాలయం చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రముఖ ఆడిటర్ రామరాజు శ్రీనివాసరావు, పచ్చల నాగమహిత, వెంకటగిరి నాగలక్ష్మి పాల్గొన్నారు.
గుర్తుతెలియని మృతదేహం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం పశువుల హాస్పిటల్ బ్రిడ్జి సమీపంలో బకింగ్‌హామ్ కెనాల్‌లో నీటిలో తేలియాడుతున్న మహిళ మృతదేహాన్ని స్ధానికులు శనివారం గుర్తించారు. తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. ఆమె వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతిచెందిన మహిళకు సుమారు 60 సంవత్సరాలు ఉండవచ్చని, శరీరం నిండా తెల్లమచ్చలు (బొల్లి) ఉన్నాయని, శరీరంపై గోల్డ్ కలర్ చీర, రెడ్ కలర్ లో దుస్తులు, ఎర్ర జాకెట్‌పై గోల్డ్ కలర్ బోర్డరు కలిగి ఉందని, ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే 08645272186కు సమాచారం ఇవ్వాలని తాడేపల్లి పోలీసులు కోరారు.

హోరాహోరీగా అండర్–17 బాలుర వాలీబాల్ పోటీలు