
జంతు సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
గుంటూరు మెడికల్: ప్రజల జీవన విధానంలో భాగమైన జంతువులకు అత్యున్నత స్థాయి సంరక్షణను అందించటంలో పశువైద్యులతో పాటు, ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక కొత్తపేటలోని జిల్లా పశువైద్యశాలలో జరిగిన ప్రపంచ పశువైద్య దినోత్సవం – 2025లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పశువుల ఆరోగ్యం ప్రజల ఆరోగ్యంతో అనుసంధానమై ఉందని చెప్పారు. తన తండ్రి వెటర్నరీ డాక్టర్‌గా మధురై పరిసర ప్రాంతంలో సేవలు అందించారని కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. పశువైద్యంతో తమ కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. ఇక్కడ కూడా పశువైద్య సేవలు బాగా అందుతున్నాయని కొనియాడారు. గ్రామంలో పశుసంపద వల్ల ప్రజల జీవనోపాధి మెరుగు పడుతుందన్నారు. పట్టణవాసులు సైతం పెంపుడు జంతువుల పెంపకంపై ఇష్టం చూపుతున్నారన్నారు. పెంపుడు జంతువులతో పాటు వీధి కుక్కలు, పిల్లుల సంరక్షణకు ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ప్రభుత్వ పశు వైద్యశాలలో జంతువులకు నాణ్యమైన వైద్యసేవలను అందిస్తున్నారన్నారు. జంతువుల ఆరోగ్య సంరక్షణలో నిరంతరం కృషి చేస్తున్న పశువైద్యులకు, వెటర్నీ పారమెడికల్ సిబ్బందికి, జంతు ప్రేమికులకు, స్వచ్ఛంద సేవ సంస్థలకు అంతర్జాతీయ పశువైద్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పశు సంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ ఒ.నరసింహారావు మాట్లాడుతూ నూతన పశువైద్యశాల భవనాలకు జిల్లా కలెక్టర్ రూ.14 లక్షలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ కింద మంజూరు చేయించడం పశు వైద్యులందరికీ ఆనందదాయకమన్నారు. అనంతరం కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన విశ్రాంత పశువైద్యులు డాక్టర్. డి.రజనీకాంత్, డాక్టర్.ఆర్. లక్ష్మీప్రసాద్‌లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ కె.వి.వి.సత్యనారాయణ, డాక్టర్. ఎం.రత్నజ్యోతి, రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ వై.ఈశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె.సాంబశివరావు, జిల్లా పశు వైద్య వైద్యులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి