
ప్రయాణికుల భద్రతే డ్రైవర్, గార్డుల లక్ష్యం
సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ రవికిరణ్
లక్ష్మీపురం: రైలు ప్రయాణికుల భద్రతే డ్రైవర్, గార్డుల లక్ష్యమని, రైలును సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చడంలో ఇద్దరూ చాలా కీలకం అని సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ మద్దాలి రవికిరణ్ అన్నారు. రైలు భద్రత చర్యల పై మీడియా పర్యటన కార్యక్రమంలో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్‌లో సోమవారం ఆయన అసిస్టెంట్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ సీహెచ్. బాపయ్య, డీసీఎం కమలాకర్‌బాబుతో కలసి 4వ నంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న క్రూ లాబీ, స్టేషన్ పశ్చిమాన రన్నింగ్ రూమ్‌లను పరిశీలించారు. సిబ్బంది పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవికిరణ్ మాట్లాడుతూ డివిజన్‌లో 227 మంది లోకో పైలట్లు, 138 మంది రైలు మేనేజర్లు ఉన్నారని తెలిపారు. స్టేషన్‌లో ఉన్న క్రూ లాబీ పని చేసే విధానాన్ని వివరించారు. విధుల సమయంలో ఎదురయ్యే సమస్యలను సిబ్బంది క్రూ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఎంఎస్)లో కూడా రికార్డు చేయవచ్చని చెప్పారు. క్రూ లాబీలో లోకో పైలెట్ సైన్ ఇన్ చేసి, సైన్ ఆఫ్ చేసిన తరువాత సిబ్బందికి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేస్తామని వివరించారు. మద్యంపై పాజిటివ్‌గా వచ్చిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది విధులకు వెళ్లేటప్పుడు ఫాగ్ సేఫ్ డివైస్ (ఎఫ్‌ఎస్‌డి) పరికరాలు వాకీ టాకీ అందిస్తామని చెప్పారు. సెల్‌ఫోన్లు క్రూ లాబీలో ఉంచాలని, లోకో పైలెట్ వెంట తీసుకు వెళ్లకూడదని తెలిపారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ రవిరాజు, డివిజన్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.