
మహిళలంతా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ప్రత్తిపాడు: ప్రతి మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలోని సీతారామాంజనేయ స్వామి కల్యాణ మండపంలో సోమవారం వెలుగు ఏపీఎంలు, సీసీలు, వీవోఏలతో సమావేశాన్ని నిర్వహించారు. డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు, పథకాలను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మహిళల ముంగిటకు మరెన్నో అవకాశాలను తీసుకొస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బూర్ల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక ‘డ్వాక్రా’ అని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఓ మహిళ వ్యాపారవేత్తగా తయారవ్వాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. పెమ్మసాని ఆధ్వర్యంలో కేంద్ర దీన్ దయాళ్ ఉద్యోగ్ గ్రామ కౌశిక్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారవేత్తలను చేసేందుకు నియోజకవర్గంలో వెయ్యి మంది మహిళను గుర్తించనున్నామని తెలిపారు.
డీఆర్‌డీఏ పీడీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 151 గ్రామైక్య సంఘాల్లో ఐదు వేల ఎస్‌హెచ్‌జీ గ్రూపులు, 51 వేల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని తెలిపారు. వీరంతా 25 ఏళ్లుగా పొదుపులు తీసుకుని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నా, జీవనోపాదుల కార్యక్రమం ఆశించినంతగా జరగడం లేదని తెలిపారు. అందువల్ల ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాల వెలుగు ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అదే లక్ష్యంతో పని చేస్తున్న కూటమి ప్రభుత్వం