
రైలు దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
తెనాలి రూరల్: రైలు ప్రయాణికులపై కర్రతో దాడి చేసి వారి నుంచి నగదు, ఫోన్‌లు దోచుకుంటున్న ఇద్దరు నిందితులను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి జీఆర్పీ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌ఐ జి. వెంకటాద్రి వివరాలు వెల్లడించారు. ఈ నెల 21న రాత్రి కాకినాడ–తిరుపతి రైలులో మాచర్ల సంతోష్‌కుమార్ ప్రయాణిస్తున్నారు. రైలు నిడుబ్రోలు స్టేషన్‌కు సమీపానికి రాగానే ఇద్దరు వ్యక్తులు అతనిపై కర్రతో దాడి చేసి గాయపరచి, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. సంతోష్‌కుమార్ వేరే ఫోన్ నుంచి తన నంబరుకు చేశారు. నిందితులు తాము చెప్పిన నంబరుకు రూ. 20 వేలు పంపాలని డిమాండ్ చేశారు. దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. తెనాలి జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులను నిడుబ్రోలుకు చెందిన దేవర సాయి, యర్రంశెట్టి వంశీలుగా గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గతంలో అపహరించిన మరో సెల్‌ఫోన్ విషయాన్ని నిందితులు చెప్పడంతో వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, నేరాలకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనపర్చుకున్నారు. రైలు ప్రయాణికులపై దాడి చేయడం, దోచుకోవడం చేస్తే సహించేదిలేదని ఎస్‌ఐ వెంకటాద్రి స్పష్టం చేశారు. నేరాలను నియంత్రించడానికి గస్తీ సిబ్బందితో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.