నవమాసాలు మోసి కనిపెంచితే వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనుకున్న బిడ్డలు క్షణికావేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.. పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఒకరు.. తండ్రి మందలించాడని మరొకరు.. చదువులో రాణించలేకపోతున్నానని ఓ విద్యార్థిని ఇలా చిన్నచిన్న కారణాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. మంగళవారం ఒకేరోజు ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడడం బాధాకరం.
సంగెం: చదువుకోకుండా ఎందుకు జులాయిగా తిరుగుతున్నావని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తీగరాజుపల్లి గ్రామానికి చెందిన చింపాల రమేష్, అరుణ దంపతుల పెద్ద కుమారుడు నితిన్(21) హనుమకొండలోని చైతన్య డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 29నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయని, ఇంటివద్ద ఉండి చదువుకోకుండా ఎందుకు తిరుగుతున్నావని ఈనెల 14న ఆదివారం తండ్రి రమేష్ మందలించాడు. అనంతరం తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లారు.
ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నితిన్ పురుగుల మందు తాగుతుండగా రమేష్ చెల్లెలు కుమారుడు చూసి సమాచారం అందించడంతో వెంటనే వరంగల్‌లోని సంరక్ష ఆస్పత్రికి తరలించారు. ఈనేపథ్యంలో నితిన్ మంగళవారం ఆస్పతిలో మృతి చెందాడు. నితిన్ తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు.
తండ్రి మందలించాడని విద్యార్థి ఆత్మహత్య
హసన్‌పర్తి: భూపాలపల్లి సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్లితే... జనగామ జిల్లా లింగాలఘణపురానికి చెందిన గండి వైష్ణవి భూపాలపల్లి సాంఘిక సంక్షేమ డిగ్రీ (ప్రస్తుతం హసన్‌పర్తిలో నిర్వహిస్తున్నారు.) కళాశాలలో 2022–2023లో మొదటి సంవత్సరం ఎంజెడ్సీ ప్రవేశం పొందింది. కాగా, సోమవారం రాత్రి వెలువడిన డిగ్రీ మొదటి సంవత్సరం ఫలితాల్లో వైష్ణవి రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయింది. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటానని తోటి విద్యార్థినులకు తెలిపింది.
ఈక్రమంలో వైష్ణవి టాబ్లెట్స్ మింగినట్లు తమకు తెలియజేయడంతో తోటి విద్యార్థినులు మంగళవారం ఉదయం అధ్యాపకులకు సమాచారం అందించారు. దీంతో బాధితురాలిని హుటాహుటిన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే వైష్ణవి మాత్రం గుళికలు మింగిన విషయాన్ని ప్రిన్సిపాల్ వింధ్యారాణి కొట్టివేశారు. డిప్రెషన్‌కు గురి కావడంతో ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వైష్ణవి టాబ్లెట్స్ మింగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు.
నాడు తమ్ముడు.. నేడు అన్న
అరుణ రమేష్ దంపతులుకు ఇద్దరు కుమారులు నితిన్, నిఖిల్‌లు. 2020 జనవరిలో 7వ తరగతి చదువుతున్న తమ్ముడు నిఖిల్(12) పురుగుల మందు తాగి 10 రోజులు చికిత్స అనంతరం ఆస్పత్రిలో మృతి చెందాడు. నేడు అన్న నితిన్ కూడా అదేవిధంగా మృతి చెందాడు. మూడేళ్ల వ్యవధిలో క్షణికావేశంతో ఇద్దరు కుమారులు ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment