
హన్మకొండ: పాము కాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ఇబ్ర హీంపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన దొరగొల్ల ఎల్లయ్య, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు మహేష్ (27), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులకు చేదోడువాడుగా ఉండే మహేష్ మంగళవారం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు.
గ్రామ పెద్ద చెరువు కట్ట చివరన గొర్రెలను మేపుతుండగా మహేష్‌కు పాము కాటువేసింది. తనకు పాము కాటువేసినట్లు స్నేహితులకు ఫోన్ చేసి తెలిపాడు. ఘటనా స్థలిలోనే అస్వస్థతకు గురైన మహేష్‌ను స్థానికులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. కాగా, అందరితో కలివిడిగా ఉండే మహేష్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.