శివ పూజకు వేళాయె..
● కాళేశ్వరాలయంలో ఏర్పాట్లు పూర్తి
● నేడు శ్రీశుభానంద–ముక్తీశ్వరుల కల్యాణం
కాళేశ్వరం: ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివ పూజకు సర్వం సిద్ధం చేశారు. దేవస్థానఅధికారులు ఆలయంతో పాటు గోదావరి తీరం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలతో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ప్రత్యేక పూజలతో..
మహదేవపూర్ టస్సర్ కాలనీకి చెందిన దేవాంగ కులస్తులు నేసిన పట్టువస్త్రాలను ఉత్సవ మూర్తులకు ధరింపజేసి పూజలు ప్రారంభించారు. కల్యాణ మండపంలో ఉదయం 10గంటలకు మంగళవాయిద్యాలతో దీపారాధన, గణపతి పూజ స్వస్తిపుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షావస్త్రధారణ, ఋత్విగ్వర్ణన మత్సంగ్రహణం, 11గంటలకు దేవతాహ్వానం నవకలశారాధన, నవగ్రహారాధన, 12గంటలకు మండప దేవతారాధన, వషభధ్వజ పటాదివాసం పూజలు చేశారు. సాయంత్రం 4 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, రుద్రహవనం, రాత్రి 8 గంటలకు పుర వీధుల గుండా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, ఎదురుకోలు సేవ కార్యక్రమం నిర్వహించారు. 8.30గంటలకు కళాకారులతో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ మహేశ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, స్థానిక నాయకులు శ్రీనివాసరెడ్డి, అశోక్, రాజబాపు తదితరులు పాల్గొన్నారు.
శుభానంద–ముక్తీశ్వరుల కల్యాణానికి ఏర్పాట్లు..
మహాశివరాత్రి సందర్భంగా బుధవారం సాయంత్రం 4.35గంటలకు శ్రీముక్తీశ్వరస్వామి–శ్రీశుభానందదేవిల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. కల్యాణంతో పాటు అర్ధరాత్రి లింగోద్భవపూజకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి వద్ద జల్లు స్నానాలు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, మూడు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. మంగళవారం కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. 300 మందితో ఎస్పీ కిరణ్‌ఖరే ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment