టీచర్ గౌరవం పెంచే అభ్యర్థిని గెలిపించండి
నయీంనగర్: ఉపాధ్యాయ సమస్యలు తెలిసి నిజాయితీతో పనిచేసే వారికి, టీచర్ గౌరవం పెంచే అభ్యర్థికి ఓటువేయాలని ఎమ్మెల్సీ కోదండరాం ఉపాధ్యాయులను కోరారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పన్నాల గోపాల్‌రెడ్డికి మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రస్తుతం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అయితే డబ్బులకు ఆశపడి ఓటు అమ్ముకుంటే రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావన్నారు. విద్యాశాఖలోని అన్ని స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులకు గ్రీన్ చానల్ ద్వారా జీతాలు ఇవ్వాలని, పెన్షన్ ఉద్యోగి హక్కు అని తెలిపారు. పన్నాల గోపాల్‌రెడ్డి నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కార ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారన్నారు. వారి సమస్యలు బలంగా లేవనెత్తి ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చారన్నారు. అభ్యర్థి పన్నాల గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే తాయిలాలకు అమ్ముడుపోకుండా, జాతి నిర్మాతలైన ఉపాధ్యాయుల గౌరవం పెంచేలా నిజాయితీ, నిబద్ధత కలిగిన వారిని ఎన్నుకోవాలని కోరారు. సమావేశంలో రాజేంద్రప్రసాద్, నాగేశ్వర్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు ఓటును అమ్ముకోవద్దు
ఎమ్మెల్సీ కోదండరాం
Comments
Please login to add a commentAdd a comment