వరంగల్ అర్బన్: బదిలీ అయిన బల్దియా అధికారి అత్యుత్సాహంతో కులగణన దరఖాస్తుల ‘ఆన్‌లైన్’ నమోదు తలకిందులైంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 15 నుంచి నెలాఖరు వరకు కులగణన పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ, బల్దియా యంత్రాంగం జనవరి 10 వరకు ఇంటింటా కులగణన చేపట్టింది. అయినప్పటికీ ఐదు శాతం ఇళ్లలో సర్వే చేయలేదనే విమర్శలున్నాయి. సేకరించిన డేటాను ‘ఆన్‌లైన్’ నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ, కాశిబుగ్గ డిప్యూటీ కమిషనర్ బదిలీ అధికారి కృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాలను పెడచెవిన పెట్టారు. ఎలక్షన్స్ డివిజన్లకు బదులుగా రెవెన్యూ వార్డుల ఆధారంగా వివరాలు నమోదు చేయాలని కంప్యూటర్ ఆపరేటర్లు, బీటెక్ విద్యార్థులకు హితోబోధ చేశారు. దీంతో వారు దరఖాస్తుల ఆధారంగా వివరాలు ఆన్‌లైన్ చేశారు. ఈక్రమంలో కాశిబుగ్గ సర్కిల్ పరిధిలోని కులగణన కాస్త ఆగమాగం, అస్తవ్యస్తంగా మారింది. వివరాలకు పొంతన లేకుండా పోవడంతో రాష్ట్ర పురపాలక శాఖ బల్దియా ఉన్నతాధికారులపై కన్నెర్రజేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఈ తప్పిదాల కారణంగా అధికారులు తలలు పట్టుకున్నారు. చివరగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని దరఖాస్తులను ఎన్నికల డివిజన్ల వారీగా మళ్లీ నమోదు చేశారు. బల్దియా అదనపు కమిషనర్, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, ఐటీ ఇన్‌చార్జ్, 20 మంది ఆపరేటర్లు వారం రోజులుగా రాత్రి, పగలు హైదరాబాద్‌లో మకాం వేసి వాస్తవ వివరాలను నమోదు చేశారు. రవాణా, ఇతర వ్యయాలు బల్దియాకు అదనంగా భారమయ్యాయి.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు?
కాశిబుగ్గ డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి ఇటీవల హైదరాబాద్ శివారులోని కొంపెల్లి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. ఆయనకు వరంగల్ బల్దియా నుంచి కమిషనర్ లాస్ట్ పే సర్టిఫికెట్ (ఎల్‌పీసీ) ఇవ్వలేదు. చేసిన తప్పిదాలకు రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆయనపై చర్యలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది.
ఆన్‌లైన్ సమగ్ర కుల గణన
నమోదులో తప్పిదాలు
డివిజన్లకు బదులు రెవెన్యూ వార్డుల వారీగా డేటా ఎంట్రీ
వారం రోజులుగా శ్రమించి సరిచేసిన అధికారులు, ఉద్యోగులు
బదిలీపై వెళ్లిన సదరు డిప్యూటీ
కమిషనర్‌పై చర్యలకు రంగం సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment