
పోస్టల్ సేవలు ప్రియం..
కాజీపేట: ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు దశల వారీగా విస్తరించిన తపాలా శాఖ.. బుక్‌పోస్ట్‌లపై ధరలు పెంచింది. దీంతో వార, పక్ష, మాస ఆధ్మాత్మిక పుస్తకాల బట్వాడపై ధరలు భారీగా పెరగడంతో పాఠకులు ఆందోళనకు గురవుతున్నారు. బుక్ సర్వీస్ పేరుతో ఇంత కాలం అతి తక్కువ ధరకే కోరుకున్న పుస్తకాలు పాఠకుడికి అందించే సౌకర్యం ఉండేది. ఇటీవల ప్రస్తుతమున్న ధరలను రెంట్టింపు చేయడంతో పుస్తకాల రవాణా పాఠకుడికి భారంగా మారనుంది. మూడు రకాల బుక్ పోస్టులను ఒకే విభాగం కిందకు తెస్తూ ప్రింటెడ్ బుక్‌పోస్ట్, రిజిస్టర్ బుక్‌పోస్ట్‌గా మార్చి సేవల ధరలు పెంచింది. ఈ నేపథ్యంలోనే నాలుగు రకాలుగా ఉన్న పోస్టు కార్డులను ఒకే విభాగం కిందకు తీసుకొచ్చారు. రిజిస్టర్ బుక్‌పోస్ట్ కాలమ్‌ను గతేడాది డిసెంబర్ 18 నుంచి ఏకంగా సాఫ్ట్‌వేర్ నుంచి తొలగించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తపాలా ఉద్యోగులతో పాటు పాఠకులను ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ నిర్ణయం దిన, వార, పక్ష, మాస పత్రికల బట్వాడపై తీవ్ర ప్రభావం చూపనుంది.
పెరిగిన ధరలతో పోలిస్తే...
పెరిగిన తపాలా ధరలతో పోలిస్తే ప్రైవేట్ కొరియర్ సేవలు మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు తక్కువ ధరకే సేవలు అందించిన తపాలా శాఖ.. ఆదాయం పెంచుకోవడం కోసం ఇలా చార్జీలు పెంచడం చర్చనీయాంశంగా మారింది. దీనికన్నా ప్రైవేట్ కొరియర్ సర్వీస్ సేవలే మేలని వినియోగదారులు అంటున్నారు. దేశంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా పుస్తకాలు, వార, పక్ష పత్రికలు తెప్పించుకోవాలంటే 5 కిలోల బరువు ఉన్న పార్సిల్‌కు గతంలో రూ.80 చెల్లించేవారు. ప్రస్తుతం అదే బరువు ఉన్న పార్సిల్‌కు రూ.365 చెల్లించాల్సి వస్తోంది. రిజిస్టర్ బుక్ పోస్ట్ ద్వారా 200 పేజీల పుస్తకాన్ని జీఎస్టీతో కలిపి రూ.25కు పంపేవారు. ఇప్పుడు ఆ సర్వీస్‌ను తపాలా శాఖ రద్దు చేయడంతో తప్పని పరిస్థితుల్లో పుస్తకాన్ని రిజిస్టర్ పార్సిల్‌లో మాత్రమే అందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రూ.100 విలువైన పుస్తకాన్ని పాఠకుడు పోస్టల్‌లో తెప్పించుకోవాలంటే రూ.80 చార్జీల కింద భరించాల్సి ఉంటుంది. ఇంత భారం భరించి పుస్తకాలు తెప్పించుకునే వారు ఎవరుంటారనే ప్రశ్న తలెత్తుతుంది.
దిగుమతి సుంకంపై ఆందోళన..
శాంపిల్ పుస్తకాలపై 5 శాతం దిగుమతి విధించడం మరింత ఆందోళనకు గురి చేసే అంశం. ప్రాంతీయ భాషలో ముద్రించిన పుస్తకాలను విదేశీ భాషల్లోకి అనువాదం చేసి ప్రచురిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో విదేశీ పబ్లిషర్లు ఆ పుస్తకాల కాంప్లిమెంటరీ కాపీలను పంపుతుంటారు. ఇలా విదేశాల నుంచి వచ్చే పుస్తకాలపై కేంద్ర ప్రభుత్వం తొలిసారి దిగుమతి సుంకం విధించింది. వాణిజ్య ప్రయోజనాలతో విక్రయించేందుకు ఉద్దేశించిన పుస్తకాలపై దిగుమతి విధించడం సమర్థనీయమే అయినా కాంప్లిమెంటరీగా పంపే పుస్తకాలపై సుంకం పేరిట అదనపు భారం మోపడం సరికాదనే వాదనలు వినపడుతున్నాయి.
భారీగా పెరిగిన తపాలా ధరలు
భారం కానున్న పుస్తకాల రవాణా
తగ్గించాలని పాఠకుల డిమాండ్
పుస్తకాలకు దూరం చేయడమే..
ప్రభుత్వ నిర్ణయంతో పాఠకులు పుస్తకం చదివే అలవాటుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిందిపోయి ధరలు పెంచడం బాధాకరం. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
– మోడెం రాజేందర్ గౌడ్, మడికొండ
బుక్‌పోస్ట్ పాత ధర(రూ.) కొత్త ధర (రూ.)
100 గ్రాములు 22.00 28.00
కేజీ 27.00 92.00
2కేజీలు 43.50 163.00
3 కేజీలు 56.40 234.00
4 కేజీలు 67.00 304.00
5 కేజీలు 80.00 365.00

పోస్టల్ సేవలు ప్రియం..
Comments
Please login to add a commentAdd a comment