నేడు ఏనుమాముల మార్కెట్ పునఃప్రారంభం
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ నేడు(సోమవారం) పునఃప్రారంభం కా నుంది. ఐదు రోజులు వరుస సెలవులు రావడంతో మార్కెట్‌లో నిలిచిన క్రయవిక్రయాలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున మిర్చి తరలివచ్చే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
9న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించే టోర్నమెంట్‌లో గెలుపొందిన క్రీడాకారులకు నగదు పురస్కారంతో పాటు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులు పేర్లు నమోదు, ఇతర వివరాలకు 90595 22986 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
రేపటి నుంచి స్కూల్
అసిస్టెంట్లకు శిక్షణ
కాళోజీ సెంటర్ : 2024 –డీఎస్సీ ద్వారా ఎంపికై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు ఈనెల 4 నుంచి 6 వరకు వరంగల్‌లో శిక్షణ నిర్వహించనున్నట్లు వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాద్, జనగామ జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న 602 స్కూల్ అసిస్టెంట్లు శిక్షణలో పాల్గొనాలని ఆయన సూచించారు. వరంగల్‌లోని రంగశాయిపేట ప్రభుత్వ హైస్కూల్‌లో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీలు, పీఈటీలకు, వరంగల్ కరీమాబాద్‌లోని జీహెచ్‌ఎస్‌లో తెలుగు స్కూల్ అసిస్టెంట్లు, భాషాపండితులు, బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్లకు, వరంగల్ శంభునిపేట జీహెచ్‌ఎస్‌లో సాంఘిక శాస్త్రం, గణితం, హిందీ స్కూల్ అసిస్టెంట్లు, హిందీ భాషా పండితులకు శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులు తాము బోధించే సబ్జెక్ట్ బుక్స్ వెంట తీసుకొచ్చుకోవాలని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
మడికొండ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మడికొండ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామానికి చెందిన కన్కెగంటి రాజు తన కుమారుడు అఖిల్‌తో కలిసి ఆటోలో కాజీపేటకు వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మడికొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం అందించగా చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment