
ఎమ్మెల్సీ రేసులో సీపీఐ నేతలు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటుపై సీపీఐ నేతలు కన్నేశారు. ఈ ఎన్నికలకు గత నెల 24న షెడ్యూల్, సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలైన రోజే సీపీఐ జాతీయ, రాష్ట్ర నేతల బృందం టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను హైదరాబాద్ గాంధీభవన్‌లో కలిసింది. నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనుండగా, 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ, 20న పోలింగ్, కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే ఎన్నికలు జరిగే ఐదు స్థానాల్లో కాంగ్రెస్‌కు 4, బీఆర్‌ఎస్‌కు 1 ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావు, పల్లా వెంకట్‌రెడ్డి, కలవేని శంకర్, ఎం.బాల నర్సింహ, ఈటీ నర్సింహ తదితరుల బృందం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
రెండు సీట్ల ప్రతిపాదన..
టీపీసీసీ చీఫ్‌ని కలిసిన సీపీఐ బృందం తమ పార్టీకి రెండు ఎమ్మెల్సీ సీట్లను కేటాయించాలని వినతిపత్రం సమర్పించింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఒకటి.. ఐదారు మాసాల్లో ఖాళీ అయ్యే స్థానాల్లో మరొటి ఇవ్వాలని అడిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. రెండు సీట్లలో ఒకటి దక్షిణ తెలంగాణ, మరొటి ఉత్తర తెలంగాణకు ఇవ్వాలన్న ప్రతిపాదన చేసినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా అవకాశం ఉన్నా సీటు వదులుకున్న మునుగోడు.. ఉద్యమాల చరిత్ర కలిగిన చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కని వరంగల్ నియోజకవర్గాల నాయకుల పేర్లను పార్టీ నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. ఎంపీ ఎన్నికల సమయంలో సైతం వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని అడిగిన సీపీఐ.. కాంగ్రెస్ నాయకత్వం సూచన మేరకు పట్టు వీడింది. ఎమ్మెల్సీ స్థానాల్లోనైనా వరంగల్‌కు చోటు ఇవ్వాలని సీపీఐ నేతలు భావిస్తున్నారు.
ఎమ్మెల్సీ కోసం మొదలైన ప్రయత్నాలు...
అలయెన్స్‌లో భాగంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం సీపీఐలో ప్రయత్నాలు ఎవరికీ వారీగా ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత నెల్లికంటి సత్యంతోపాటు సీపీఐ రాష్ట్ర సహాయ కారద్యర్శి, వరంగల్‌కు చెందిన తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావుల పేర్లు పార్టీ నాయకత్వం పరిశీలనలో ఉన్నాయి. వీరితో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా తనకే అవకాశం ఇవ్వాలని నాయకత్వానికి కోరినట్లు తెలిసింది. ఏఐఎస్‌ఎఫ్ కార్యకర్త నుంచి ఆలిండియా అధ్యక్షుడిగా.. సీపీఐ ఉమ్మడి వరంగల్‌కు మూడు పర్యాయాలు కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్‌రావు కూడా గట్టిగా పట్టుపడుతున్నారు. కూనంనేని సాంబశివరావు తర్వాత రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కీలక పోస్టులో ఉన్న శ్రీనివాస్‌రావు.. ఉద్యమ ప్రాంతం, వరంగల్‌నుంచి పార్టీ నేతలకు పెద్దగా అవకాశాలు రానందున తనకు చాన్స్ ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. సోమవారం టీపీసీసీ చీఫ్‌ను కలిసిన బృందం... సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులను కలవాలనుకున్నా సీఎం ఢిల్లీకి వెళ్లడంతో కుదరలేదు. మంగళవారం సీఎం, ఇతర మంత్రులను ఓ బృందం కలవనుండగా.. ఢిల్లీలో నేడు జరుగుతున్న సీపీఐ జాతీయ సభల్లో పాల్గొనడంతోపాటు కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు మరో బృందం బయలుదేరింది. ఈ బృందంలో తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావుతోపాటు పలువురు ఉన్నారు.
టీపీసీసీ చీఫ్‌ను కలిసిన కమ్యూనిస్టులు.. నేడు సీఎంను కలవనున్న బృందం
రెండు విడతల్లో రెండు సీట్ల ప్రతిపాదన
పరిశీలనలో వరంగల్, మునుగోడు నాయకులు
వరంగల్ నుంచి తక్కల్లపల్లి శ్రీనివాసరావు పేరు
Comments
Please login to add a commentAdd a comment