‘పొలంబాట’తో సత్ఫలితాలు
హన్మకొండ: విద్యుత్ అధికారులు చేపట్టిన పొలంబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రైతులకు ఉత్తమ సేవలు అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం పొలంబాట కార్యక్రమాన్ని చేపట్టింది. డీఈ, ఏడీఈ, ఏఈ, ఇతర అధికారులతోపాటు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్లు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి నేరుగా సమస్యలు తెలుసుకుంటున్నారు. రైతులు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈసందర్భంగా విద్యుత్ ప్రమాదాల పట్ల అధికారులు వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఆటోమేటిక్ స్టార్టర్ల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, కెపాసిటర్లు అమర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. వంగిన స్తంభాల, లూజ్ లైన్లు సరిచేయడం, మధ్య స్తంభాలు ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెలు పెంచడం వంటి అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. పొలాల్లో లూజ్ లైన్లు, ఎత్తు తక్కువగా విద్యుత్ లైన్లు ఉండడంతో వరి కోతల సమయంలో హార్వెస్టర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లూజ్ లైన్లు, కిందకు ఉన్న లైన్ల ఎత్తును పెంచుతున్నారు. ఎత్తు పెంచేందుకు 9.1 మీటర్ ఎత్తున్న విద్యుత్ స్తంభాలు నాటుతున్నారు.
పరిష్కారమవుతున్న విద్యుత్ సమస్యలు
క్షేత్రస్థాయికి వెళ్తున్న
ఎన్‌పీడీసీఎల్ అధికారులు
విద్యుత్ వినియోగంపై
రైతులకు అవగాహన
హనుమకొండ జిల్లాలో 277,
వరంగల్ జిల్లాలో 40 ‘పొలంబాట’ కార్యక్రమాలు
హనుమకొండ జిల్లా (సర్కిల్)లో..
ఇప్పటివరకు 277 పొలంబాట కార్యక్రమాలు చేపట్టారు. 238 వంగిన స్తంభాలు, 703 లూజ్ లైన్లు సరి చేశారు.
1,179 మధ్యస్తంభాలు ఏర్పాటు చేశారు.
ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్యూర్ కాకుండా ఎర్తింగ్ సరిగ్గా ఉండేలా ఏర్పాట్లు చేశారు.
తక్కువ ఎత్తులో ఉన్న 128 ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచారు.
ప్రమాదకరంగా ఉన్న డబుల్ ఫీడింగ్, లో లెవెల్ లైన్ క్రాసింగ్‌లను తనిఖీ చేసి సరిచేస్తున్నారు.
ఇప్పటివరకు 144 డబుల్ ఫీడింగ్, లో లెవెల్ లైన్ క్రాసింగ్‌లను మార్చారు.
లైన్లు తక్కువ ఎత్తులో ఉన్న వాటి స్థానాల్లో 9.1 మీటర్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా (సర్కిల్) పరిధిలో..
ఇప్పటివరకు 40 పొలంబాట కార్యక్రమాలు చేపట్టారు.
ఇందులో 236 వంగిన స్తంభాలు, 739 లూజ్‌లైన్లు సరిచేశారు.
659 మధ్యస్తంభాలు ఏర్పాటు చేశారు.
తక్కువ ఎత్తులోఉన్న 98 ట్రాన్స్‌ఫార్మర్‌ల గద్దెల ఎత్తు పెంచారు.
ఇప్పటివరకు 76 డబుల్ ఫీడింగ్, 134 లో లెవెల్‌లైన్ క్రాసింగ్‌లను మార్చారు.
హార్వెస్టర్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలతోపాటు తక్కువ ఎత్తులో లైన్ల స్థానాల్లో 9.1 మీటర్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment