
‘వెల్‌నెస్’.. సేవల్లో డల్‌నెస్
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలోని వెల్‌నెస్ సెంటర్‌లో కనీస వసతులు కరువయ్యాయి. అధికారులు, పాలకుల చిన్నచూపుతో నిత్యం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వెల్‌నెస్ సెంటర్‌కు వయస్సు పైబడిన వారే అత్యధికంగా వస్తుంటారు. ఇక్కడ వీరికి మౌలిక వసతులు కూడా అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సెంటర్‌లోని టాయిలెట్లకు తాళం వేసి ఉన్న ఘటన మరవకముందే.. సోమవారం అంతర్గత సమస్యతో సెంటర్‌లో విద్యుత్ సరఫరా నిలిచింది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఓపీ ప్రారంభమైన 10 నిమిషాలకే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అప్పటికే కొంతమందికి ఆన్‌లైన్‌లో ఓపీ చిట్టీలు ఇవ్వగా .. మరికొందరికి మాత్రం ఆఫ్‌లైన్‌లో చిట్టీలు ఇచ్చారు. కానీ.. విద్యుత్ సరఫరా లేక మందుల సరఫరా నిలిచిపోయింది. వైద్యులు సైతం అందుబాటులో లేక రోగులకు ఎదురు చూపులు తప్పలేదు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే పరిష్కరించాల్సిన సెంటర్ నిర్వాహకులు ఒంటి గంట వరకు నిధానంగా పని కానిచ్చారు. ఇదే సాకుగా భావించిన కొందరు డాక్టర్లు విధులకు డుమ్మా కొట్టి వెళ్లిపోయారు. దీంతో వైద్య పరీక్షల కోసం వచ్చిన రోగులు వెనుదిరగక తప్పలేదు. అనంతరం 1 గంటకు సమస్య పరిష్కారమైంది. కానీ చాలామంది అప్పటికే ఇళ్లకు వెళ్లిపోయారు. ఈవిషయంపై వైద్య సిబ్బందిని ఆరా తీయగా.. బ్రేకర్లు పడిపోవడంతో వి ద్యుత్ సరఫరా నిలిచిందని, ఇన్వర్టర్ సైతం పాడైందని తెలిపారు.
వెల్‌నెస్ సెంటర్లో అంతర్గత సమస్యతో
నిలిచిన విద్యుత్
రోగుల ఎదురుచూపులు.. డాక్టర్ల డుమ్మా
Comments
Please login to add a commentAdd a comment